ఆర్నాబ్, మురసు తుఫాన్ల ప్రభావిత ప్రాంతాల్లో పశువులకు ఉచితంగా దాణా పంపిణీ

Publish Date : 10/11/2026
WhatsApp Image 2026-11-10 at 3.14.10 PM

పశుసంపదను కాపాడేందుకు రూ.66 లక్షలతో 300 టన్నుల పశుదాణా, రూ.4 లక్షలతో మందులు సిద్ధం చేయడం జరిగింది

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

ఆర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునగడంతో గత 15 రోజులుగా పశువులకు పచ్చిమేత, పశుగ్రాసం అందుబాటులో లేకుండా పోయిందని పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
మంగళవారం నరసాపురం మండలం తూర్పు తాళ్లు గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత పశుదాణా పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని రైతులకు పశుదాణాను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, మాట్లాడుతూ తుఫాన్ల కారణంగా వరద నీరు పంట పొలాల్లో నిలిచిపోవడంతో పశువులకు మేత కొరత ఏర్పడిందన్నారు.
ముఖ్యంగా పాడి పశువులపై ఆధారపడి జీవనం సాగించే రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారి పశుసంపదను కాపాడటమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
జిల్లాలో పశువులు కలిగిన రైతులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రూ.66 లక్షల వ్యయంతో 300 టన్నుల పశుదాణాను సిద్ధం చేశామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పశువులకు తగిన పోషకాహారం అందించేందుకు ఈ దాణా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రైతులు తమ పశువులు ఉచిత పశుదాణాను తీసుకువెళ్లి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
వరదల సమయంలో పశువులకు సరైన ఆహారం అందించడంతో పాటు వాటి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రూ.4 లక్షల వ్యయంతో అవసరమైన మందులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పశువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమీపంలోని పశువైద్య సిబ్బందిని సంప్రదించాలని రైతులకు సూచించారు.
యనమదురు డ్రెయిన్‌లో వరద ప్రవాహం ఇంకా ఉద్ధృతంగా కొనసాగుతోందని, పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునగడంతో పశువులకు మేత కొరత ఏర్పడిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తోందన్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, ఇతర కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, పాడి రైతులు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ దాసిరాజు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆర్.కోటిలింగరాజు, డిప్యూటీ డైరెక్టర్ పి.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి, తాహసిల్దార్ ఈ.నాగార్జుvన, డా. సురేంద్ర కుమార్, వి ఆర్ ఓ కె.బాలాజీ, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.