రబీ సీజన్‌కు అవసరమైన విత్తనాలను సిద్ధం చేయాలి నవంబర్ 15వ తేదీలోగా నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి…..

Publish Date : 10/11/2026
WhatsApp Image 2026-11-10 at 4.32.37 PM

రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అర్నబ్ తుఫాను ప్రభావంతో జిల్లాలో వరి పంట పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు నవంబర్ 15వ తేదీలోగా నర్సరీల ఏర్పాటుకు అవసరమైన చర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో వరి సాగు చేసే రైతులకు ఎంటీయూ 1120 రకం విత్తనాలను సరఫరా చేయాలని సూచించారు.

తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలకు సంబంధించి క్రాప్ కటింగ్ ప్రయోగాలను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 254 గ్రామాల్లో క్రాప్ కటింగ్ ప్రయోగాలు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటివరకు 18 గ్రామాల్లో మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన గ్రామాల్లో కూడా వెంటనే ప్రయోగాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు.రబీ సీజన్‌లో రైతులకు అవసరమైన సహకారం అందించేందుకు వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సునీత, సీపీఓ శివపార్వతి, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.