**తుఫాను ప్రభావంతో పంట నష్టంపై క్షేత్రస్థాయి అంచనాలు పూర్తి చేయాలి.
**రైతులకు పంటల బీమా పరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి.
**రబీ సీజన్‌కు అవసరమైన వరి విత్తనాలను ముందుగానే సేకరించి అందుబాటులో ఉంచాలి.
**-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో పంట నష్టాల అంచనా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పియంఎఫ్ బి వై) అమలు, పంట కోత ప్రయోగాల(సిసిఇ ) పురోగతిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.
బుధవారం వశిష్ట సమావేశ మందిరంలో వ్యవసాయ, ప్రణాళిక, బీమా సంస్థల అధికారులతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
రానున్న రబీ సీజన్‌కు అవసరమైన వరి విత్తనాల లభ్యత, సేకరణపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని తెలిపారు.
వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (సస్యరక్షణ) ఎం. విజయభారతి, మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. మల్లికార్జునరావు, డాక్టర్ ఎం. గిరిజారాణి, డాక్టర్ బి.వి. రమణ తుఫాను ప్రభావిత పంట పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితులను పరిశీలించి జిల్లా కలెక్టర్ కు వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ పి గ్లోరీ, జిల్లా వ్యవసాయ అధికారిణి జి. సునీత, ముఖ్య ప్రణాళికా అధికారిణి శ్రీమతి కె. శివపార్వతి, జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ, ప్రణాళికా శాఖ అధికారులు, మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
**తుఫాను ప్రభావంతో 1,98,043 ఎకరాల్లో పంట నష్టం.
అర్నబ్ తుఫాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు వరద నీటిలో మునిగిపోయాయన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,98,043 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారన్నారు.
జిల్లాలోని మొత్తం 20 మండలాల్లో క్షేత్రస్థాయిలో పంట నష్టాల అంచనా ప్రక్రియను పూర్తి చేసి, సంబంధిత వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. పంట నష్టం వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా గణాంకాలను నిర్ధారించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద జిల్లాలో మొత్తం 1,096 బీమా యూనిట్లను పంట నష్టాల పరిశీలన కోసం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 18 పంట కోత ప్రయోగాలు (సిసిఇ లు ) మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. గుర్తించిన మొత్తం 1,096 బీమా యూనిట్లలో దాదాపు 80 శాతం యూనిట్ల పరిధిలో నూరు శాతం పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో మిగిలిన పంట కోత ప్రయోగాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
**వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే పంట కోత ప్రయోగాలు.
పంట పొలాల్లో నిలిచిన వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే నిబంధనల ప్రకారం పంట కోత ప్రయోగాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి ప్రయోగానికి సంబంధించిన వివరాలను జియో కోఆర్డినేట్స్‌తో సహా ఫారం-1 లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. పంట కోతకు ముందు, కోత అనంతరం పాటించాల్సిన నిర్దేశిత విధానాలను అనుసరిస్తూ ప్రయోగాలను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పంట కోత ప్రయోగాల ద్వారా నమోదయ్యే వివరాలు రైతులకు బీమా పరిహారం అందించడంలో కీలకమైనందున ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
**రైతులకు బీమా పరిహారం అందించేందుకు శాఖల సమన్వయం.
పంట నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పరిహారం సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ, ప్రణాళికా శాఖ, బీమా సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
సహాయ వ్యవసాయ సంచాలకులు, ముఖ్య ప్రణాళికా అధికారి పరిధిలోని అధికారులు, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ పంట నష్టం అంచనాలు, పంట కోత ప్రయోగాల ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి గణాంకాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి మిగిలిన పంట కోత ప్రయోగాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
**-రబీ సీజన్‌కు వరి విత్తనాల ముందస్తు సేకరణ.
రానున్న రబీ సీజన్లో రైతులకు అవసరమైన వరి విత్తనాల లభ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్థానికంగా అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలను క్షేత్రస్థాయి అధికారుల ద్వారా సేకరించి, సాగు విస్తీర్ణం, రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాల లభ్యతను అంచనా వేయాలని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన విత్తనాలను ముందుగానే సేకరించి అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో అధికంగా సాగు చేసే యంటియు 1121 రకం వరి విత్తనాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. ఈ రకం విత్తనాలు విజయనగరం జిల్లాలో అందుబాటులో వున్నాయని, సాధ్యమైనంత మేర వాటిని అందుబాటులోనికి తెచ్చేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక లు సిద్ధం చేయాలని అన్నారు.
తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా తగిన ప్రయోజనాలు అందేలా, పంటల బీమా ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు రబీ సాగుకు అవసరమైన విత్తనాల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, డిఆర్ఓ పి. గ్లోరీ, జిల్లా వ్యవసాయ అధికారిణి జి. సునీత, ముఖ్య ప్రణాళికా అధికారిణి కె. శివపార్వతి, జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ, ప్రణాళికా శాఖ అధికారులు, మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు