జిల్లాలో 246 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ
జిల్లాలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అవసరమైన గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలు తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ ఎండి ఇబ్రహీం, డీఎస్ఓ ఎన్ సరోజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి సునీత, ఏడి కే ఎస్ ఎస్ శ్రీనివాస్, శాఖల అధికారులు పాల్గొన్నారు.