మాతృ, శిశు మరణాల నివారణలో నిర్లక్ష్యం వహించే వైద్యులపై కలెక్టర్ ఆగ్రహం జన్మనిస్తూ తల్లి, జన్మిస్తూ శిశువు మరణించకూడదు
జిల్లాలో మాతృ, శిశు మరణాలను సంపూర్ణంగా నివారించడమే లక్ష్యంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జూలై, ఆగస్టు, నెలల్లో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలకు గల కారణాలు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
*మాతృ శిశు మరణాల నివారణలో నిర్లక్ష్యం వహించే వైద్యులు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
జన్మనిస్తూ తల్లి, జన్మిస్తూ శిశువు మరణించకూడదని అన్నారు
వైద్యరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాతృ, శిశు మరణాలు సంభవించడం విచారకరమన్నారు. ప్రతి తల్లి, ప్రతి శిశువు ఆరోగ్యంగా ఉండేలా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం జరిగే వరకు గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన మందులు అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అధిక రక్తపోటు, రక్తహీనత తదితర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందించాలన్నారు. ప్రసవానంతరం కూడా తల్లి, శిశువు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
అత్యవసర వైద్య కేసుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న గర్భిణులను గుర్తించిన వెంటనే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఉన్నత స్థాయి వైద్య సదుపాయాలు కలిగిన ఆసుపత్రులకు సకాలంలో తరలించాలని ఆదేశించారు. రిఫరల్ కేసుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
మాతృ, శిశు మరణాలు సంభవించిన ఆసుపత్రులకు చెందిన వైద్యులు, సిబ్బందిని కమిటీ సమక్షంలో ప్రశ్నించి, ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. మరణాలకు దారితీసిన పరిస్థితులు, వైద్యపరమైన లోపాలు, అందించిన చికిత్స, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి కేసును సమగ్రంగా విశ్లేషించి, గుర్తించిన లోపాలను తక్షణమే సరిదిద్దుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. మాతృ, శిశు మరణాల పట్ల నిర్లక్ష్యం వహించే వైద్యులు, సిబ్బందిపై బాధ్యత నిర్ణయించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గర్భిణులు, బాలింతలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదకర లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు.
మాతృ, శిశు మరణాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, జిల్లాలో ఒక్క మాతృ మరణం, ఒక్క శిశు మరణం కూడా సంభవించకుండా సమష్టి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. రాంబాబు, డీసీహెచ్ఎస్ డాక్టర్ పి. సూర్యనారాయణ, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ జి. మౌనిక, గైనకాలజిస్టులు డాక్టర్ మాధవి కళ్యాణి, డాక్టర్ ఐ. లక్ష్మి, డాక్టర్ కీర్తి, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.