**జనగణన–2027 నిర్వహణకు అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. **జనాభా గణన ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి.

Publish Date : 13/11/2026
WhatsApp Image 2026-11-13 at 4.56.51 PM

**జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం, 13 నవంబర్, 2026.

జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో భారత జనగణన–2027కు సంబంధించి రెండో దశ జనాభా గణన నిర్వహణపై జిల్లా, చార్జ్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జనగణన ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు, అధికారుల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ఇంతకుముందు కేవలం ఇళ్ల జాబితా మాత్రమే పూర్తి చేసుకోగా, ఈ రెండో దశలో వ్యక్తిగత జనాభా గణన నిర్వహించబడుతుందన్నారు.
​ఇందులో ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలు, సామాజిక సాంస్కృతిక, ఆర్థిక వివరాలు సేకరించటం జరుగుతుందన్నారు. ఇవి చాలా గోప్యంగా, అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాల్సిన ప్రక్రియ అన్నారు. ​ఈ ప్రక్రియలో పాల్గొనే ట్రైనర్స్, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా విధులు నిర్వర్తించేలా శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. ​క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఈ శిక్షణా కార్యక్రమంలో క్షుణ్ణంగా వివరించడం జరుగుతుందన్నారు.
**జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, చార్జ్ అధికారులు అయిన మండల స్థాయి తహశీల్దార్లు, యంపిడిఓ లు, ఇతర శాఖల అధికారులు ఎన్నికలు, వరద నిర్వహణ వంటి విధులతో పాటు ఈ జాతీయ ప్రాముఖ్యత కలిగిన జనగణన ప్రక్రియను కూడా అంతే ప్రాధాన్యతతో నిర్వహించాలని పేర్కొన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు. జన గణనలో ఎటువంటి పొరపాట్లు, ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందుగానే సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ​ ఈ శిక్షణా కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు పాత్ర ఎంతో కీలకమన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలన్నారు. ​మండల స్థాయి చార్జ్ అధికారులు అందరూ సమన్వయంతో వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. జనగణన అనేది దేశ సామాజిక, ఆర్థిక, జనాభా పరిస్థితులను అంచనా వేయడానికి అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పనకు అవసరమైన ప్రణాళికలు రూపొందించబడతాయని పేర్కొన్నారు.

**ఫేజ్ -2 జనాభా గణన ఫిబ్రవరి, 2027 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు.
జనాభా గణనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేయాలని సూచించారు.

**జనగణన ​ముఖ్యమైన తేదీలు:
​సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) 2027 జనవరి 10వ తేదీ నుంచి 24 వరకు, ​ఇంటింటి జనాభా గణన 2027 జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు, ​జనవరి 10వ తేదీ నుండి 24 వరకు ప్రజలు స్వయంగా జనాభా గణన వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

శిక్షణలో పొందిన అవగాహనను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు తెలిపారు.
జిల్లా స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ, జనగణన కోఆర్డినేటర్ డాక్టర్ జగన్నాథ్ మాజీ, జిల్లా జన గణన అధికారి బి. భాగ్యప్ప, మాస్టర్ ట్రైనర్ ఏ. కృష్ణవేణి, డి ఆర్ ఓ పి. గ్లోరీ, డ్వామా పిడి డాక్టర్ కె. సి హెచ్. అప్పారావు, నరసాపురం, తాడేపల్లిగూడెం ఆర్డీఓ లు, జిల్లా మరియు చార్జ్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.