**బాలల హక్కులు, భద్రత, ఆరోగ్యం, విద్యకు ప్రభుత్వం పెద్దపీట.
*విద్యార్థులు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించాలి
**బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి.
**బాల్యవివాహ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.
**జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం, 14, నవంబర్ 2026.
బాల్యవివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, బాలల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు.
శనివారం భీమవరంలోని డి.ఎన్.ఆర్. కళాశాలలో నిర్వహించిన బాలల దినోత్సవం, బాల్యవివాహ రహిత భారత్ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. జాతీయ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థినీ విద్యార్థులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు.
పిల్లలపై వేధింపులు జరిగినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, వారి ఆరోగ్యం, విద్య, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
*బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.
పండిట్ జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ప్రేమాభిమానాలు ఉండేవని, పిల్లలతో సమయం గడపడం, వారి సమస్యలను తెలుసుకోవడం, వారిని ప్రోత్సహించడం ఆయనకు ఎంతో ఇష్టమైన విషయాలని కలెక్టర్ గుర్తు చేశారు. బాలల సమస్యలు, వారి ఆశయాలు, అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రతి బాలబాలికకు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, సమాజంలో భాగస్వామ్యమయ్యే హక్కు ఉన్నాయని స్పష్టం చేశారు. బాలల హక్కులను గౌరవించడం, వారి అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
**అంగన్వాడీల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం.
గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఆరు సంవత్సరాల లోపు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, పప్పులు, బియ్యం తదితర పౌష్టికాహార పదార్థాలను అందిస్తూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కృషి చేస్తోందన్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక అభివృద్ధికి బాటలు వేయవచ్చని తెలిపారు.
**పోక్సో చట్టంపై ప్రతి విద్యార్థికి అవగాహన అవసరం.
బాలల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, వారిని లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు పోక్సో చట్టాన్ని అమలు చేస్తోందని తెలిపారు . పిల్లలపై జరిగే లైంగిక నేరాలను అరికట్టడం, బాధిత బాలబాలికలకు న్యాయం కల్పించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
పిల్లలు తమ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అపరిచితులు లేదా తెలిసిన వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించినా, తప్పుగా తాకినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. ఇలాంటి ఘటనల్లో తప్పు పిల్లలది కాదని, తప్పు చేసిన వారిదేనని స్పష్టం చేశారు. బాలల భద్రతపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవర్చుకోవాలని సూచించారు.
బాలల హక్కులను గౌరవిస్తూ బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేష్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామ్ సుందర్, డి.ఎన్.ఆర్. కళాశాల కార్యదర్శి రామకృష్ణ రాజు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.