విజ్ఞానం పెరగాలంటే పుస్తక పఠనం చాలా అవసరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ
డాక్టర్ బి వి రాజు
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం భీమవరం వన్‌టౌన్‌లోని డా. బి.వి. రాజు పార్కు సమీపంలో ఉన్న ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో ‘గ్రంథాలయ వైతాళికులకు జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ ఘనంగా నివాళి అర్పించారు.
డిజిటల్ యుగంలో గ్రంథాలయాల ఆధునీకరణ, యువతలో పఠనాసక్తి పెంపు’ అనే అంశాలపై నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ రంగ వైతాళికులు డా. ఎస్.ఆర్. రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను
నేర్చుకోవడానికి చదవండి నాయకత్వం వహించడానికి నేర్చుకోండి అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. మనకు విజ్ఞానం పెరగాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమని, పుస్తకాల ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థులు చిన్నతనం నుంచే మహనీయుల జీవిత చరిత్రలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా తాను 5, 6వ తరగతులలో ఉన్నప్పుడు భారత మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం రచించిన ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకాన్ని చదివానని, ఆ పుస్తకం ద్వారా లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలి అనే విషయాలను తెలుసుకోవచ్చని ఆమె వివరించారు. విద్యార్థులు తమ పాఠశాలల్లోని గ్రంథాలయాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా లైబ్రరీ అసోసియేషన్ ద్వారా గ్రామగ్రామాన గ్రంథాలయాల స్థాపనకు విజయవాడ కేంద్రంగా ఆనాటి గ్రంథాలయ ప్రముఖులు చేసిన కృషి ఎంతో గొప్పదని గుర్తుచేశారు. విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాల్లోని పుస్తకాలను చదివి, పఠన అలవాటును పెంపొందించుకోవాలని, తద్వారా అపారమైన విజ్ఞాన సంపదను ఆర్జించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త చెరుకువాడ వెంకటరామయ్య, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి (D.E.O.) ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, పుస్తక పఠనం ప్రాముఖ్యత, గ్రంథాలయాల విలువలను వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సంయుక్త కార్యదర్శి అల్లు శ్రీనివాస్, కమిటీ సభ్యులు గ్రంధి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, మహమ్మద్ సరోజిని, రామ నాగేశ్వరరావు, గ్రంథాలయ అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, సిబ్బంది సోమరాజు తదితరులు పాల్గొన్నారు.