ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి… **ఇప్పటివరకు 3475 దరఖాస్తులు స్వీకరణ – 1,118 దరఖాస్తులు పరిశీలన దశలో పెండింగ్.

Publish Date : 18/11/2026
WhatsApp Image 2026-11-18 at 2.06.15 PM

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్ సంబంధిత అధికారులకు సూచించారు.

బుధవారం భారత ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్ నుంచి బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియ, ఇప్పటివరకు అందిన దరఖాస్తులు, వాటి పరిశీలన, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3475 ఉపాధ్యాయ ఓటరు నమోదు దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. వీటిలో 1,118 దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలల నుంచి అందిన దరఖాస్తులకు సంబంధించి కళాశాలల రిజిస్ట్రేషన్, ఆర్జేడీ స్థాయి ధృవీకరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండటంతో కొన్ని సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతున్నట్లు వివరించారు.పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని, రిజిస్ట్రేషన్, ధృవీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అర్హమైన దరఖాస్తులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత కళాశాలల యాజమాన్యాలు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని వివరించారు.

గత 2021 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జిల్లాలో మొత్తం 3018 ఉపాధ్యాయ ఓటరు నమోదు దరఖాస్తులు మాత్రమే అందగా, ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 3475 దరఖాస్తులు అందాయని అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఉపాధ్యాయుల నమోదు దరఖాస్తుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల్లో ఓటు హక్కుపై అవగాహన పెరగడం, నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కలిగి ఉండటం కారణమన్నారు.

**ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు.

జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదును మరింత పెంచేందుకు ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు ఎలక్షన్ కమీషన్ కు కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ప్రాధాన్యతను వారికి వివరించి, అర్హులైన ఉపాధ్యాయులందరూ నిర్ణీత నిబంధనల ప్రకారం తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు ఎవరూ ఓటరు నమోదు ప్రక్రియకు దూరం కాకుండా చూడాలని, అందిన ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించటం జరుగుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆమె వివరించారు. జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్ల నమోదును మరింత విస్తృతం చేయడంతో పాటు, దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందని ఎలక్షన్ కమీషన్ కు వివరించారు.