*ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియ నూరు శాతం పూర్తి చేయాలి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
ఇప్పటివరకు 3475 దరఖాస్తులు స్వీకరణ – 1,118 దరఖాస్తులు పరిశీలన దశలో పెండింగ్.
**సర్ ప్రక్రియ లో అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ కేటగిరీల్లో తొలగించిన 85,444 మంది ఓటర్లపై పునఃపరిశీలన చేపట్టాలి.
**ఓటరుగా నమోదు చేసుకునేందుకు నవంబర్ 30 వరకు అవకాశం.
** ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ.
భీమవరం, 21 నవంబర్, 2026.
ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియ నూరు శాతం నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె ఆర్ కల్ప శ్రీ అన్నారు.
శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియ, ఇప్పటివరకు అందిన దరఖాస్తులు, వాటి పరిశీలన, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, సర్ ప్రక్రియ తదితర అంశాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ కె ఆర్ కల్ప శ్రీ మాట్లాడుతూ పశ్చిమగోదావరి నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 20 మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వివరాలను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించటం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఉపాధ్యాయ ఓటర్లు నమోదు ప్రక్రియ నూరు శాతం నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఉపాధ్యాయులు ఫారం- 19 లో దరఖాస్తుతో పాటు 1-11-2026 తేదీ నాటికి గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల, కళాశాలల్లో టీచర్, లెక్చరర్ గా పనిచేస్తున్నట్లు ధ్రువీకరిస్తూ సంబంధిత విద్యా సంస్థ అధిపతి నుండి ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలని తెలిపారు.
**నమోదు ప్రక్రియకు సంబంధించి
ఫామ్ -19తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వ పాఠశాల కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ, లెక్చరర్లు అనుబంధం -II పై సంబంధిత ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి, ప్రిన్సిపాల్ తో ధ్రువీకరించాలని తెలిపారు.
** ప్రైవేటు పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు అనుబంధం -II పై ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ ధ్రువీకరణతోపాటు డిఇఓ, ఆర్ ఐ ఓ, ఆర్ జె డి లతో కూడా తప్పనిసరిగా కౌంటర్ సంతకం చేయించాలని తెలిపారు.
**వీటితోపాటు అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు వివరాలను జత చేయాలని తెలిపారు.
** ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాల, కళాశాల, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో, కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్ ఐ ఓ, ఆర్ జె డీలచే అనుబంధం-II నందు తప్పనిసరిగా కౌంటర్ సంతకం చేయించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.
**సర్ ప్రక్రియ :-
ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా అబ్సెంట్ (గైర్హాజరు), షిఫ్టెడ్ (వలస వెళ్లినవారు), డెత్ (మరణించినవారు), డూప్లికేట్ (నకిలీ/పునరావృత నమోదులు) కేటగిరీలకు సంబంధించి జిల్లాలో 85,444 మంది ఓటర్ల పేర్లను తొలగించడం జరిగిందని, అయితే ఈ జాబితాలను మరోసారి సమగ్రంగా పునఃపరిశీలించి, అర్హత కలిగిన ఓటర్లు ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులకు సూచించారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు నవంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించబడిందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఓటరు జాబితా పునఃపరిశీలన ప్రక్రియను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇంచార్జ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఒ పి. గ్లోరీ, కలెక్టరేట్ ఎలక్షన్ విభాగం సూపరింటెండెంట్ శేఖర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.