ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఓటరు జాబితాల తయారీపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఓటరు జాబితాల తయారీపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
తూర్పు–పశ్చిమ గోదావరి, కృష్ణ-గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గాల ఓటరు జాబితాల తయారీ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాల తయారీపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల పదవీకాలం 2027 మార్చి 29తో ముగియనున్న నేపథ్యంలో, కొత్త ఓటరు జాబితాల తయారీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు.
తూర్పు–పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి 2026 నవంబర్ 6వ తేదీ చివరి గడువు అని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన ఉపాధ్యాయులు నిర్ణీత గడువులోగా ఫారం-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు గా నమోదు కావాలనుకునే వ్యక్తి భారత దేశ పౌరుడై ఉండాలని మరియు నియోజకవర్గంలో నివసించాలని ఆమె అన్నారు. ఓటరు ఫారం 19 లో దరఖాస్తు తో పాటు 1 నవంబర్ 2026 నాటికి గడిచిన ఆరు సంవత్సరాలలో మూడు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల , కళాశాల యందు టీచర్, లెక్చరర్ గా పని చేస్తున్నట్లు ధ్రువీకరిస్తున్న విద్యాసంస్థ అధిపతి నుండి ఒక ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలని, దరఖాస్తు తేదీలో బోధనలో లేని వ్యక్తి విషయంలో అతను చివరిగా పనిచేసిన సంస్థ అధిపతి చే సర్టిఫికెట్ సంతకం చేయబడాలని ఆమె వివరించారు.
దరఖాస్తులను ఎన్నికల సంఘం వెబ్సైట్ www.ceoandhra.nic.in ద్వారా, సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1950, లేదా స్థానిక తహసిల్దార్ వారి కార్యాలయములను సంప్రదించవచ్చునని ఆమె అన్నారు.
ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ , ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఓటరు నమోదు కోసం సమర్పించిన దరఖాస్తులను ఎన్నికల నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హత కలిగిన ఉపాధ్యాయుల వివరాలు మాత్రమే జాబితాలో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితాల తయారీకి సంబంధించిన వివిధ దశలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, తుది ఓటరు జాబితా ప్రచురణ ప్రక్రియలను నిబంధనల మేరకు నిర్వహించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు