జిల్లాలో 45 గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…. జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ జిల్లాలోని 45 గ్రామాల్లో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న రీ సర్వే పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్ల

Publish Date : 15/10/2026
WhatsApp Image 2026-10-15 at 7.56.43 PM

జిల్లాలో 45 గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…. జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ

జిల్లాలోని 45 గ్రామాల్లో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న రీ సర్వే పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం భీమవరం కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్ నుంచి భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారులతో రీ సర్వే పురోగతిపై ఆమె వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న రీ సర్వే పనుల వివరాలను సమీక్షించి, పనుల పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 45 గ్రామాల్లో రీ సర్వే పనులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిలో నరసాపురం డివిజన్‌లో 23 గ్రామాలు, భీమవరం డివిజన్‌లో 14 గ్రామాలు, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 8 గ్రామాలు ఉన్నాయని వివరించారు. ఆయా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యత క్రమంలో వేగవంతం చేసి, రీ సర్వే ప్రక్రియతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

నరసాపురం మండలంలో ఆరు గ్రామాలు, గణపవరం మండలంలో ఐదు గ్రామాల్లో రీ సర్వే పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రీ సర్వే పనుల నిర్వహణలో క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో ఆ వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి, పనులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు.

రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి, రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకోవాలని, నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను సాధించేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా సర్వే అధికారి జాషువా, కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ శేఖర్, సర్వే శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.