ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు వెలకట్టలేనివి: జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి
దేశ రక్షణ, సమాజ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీలకు సాయుధ పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం 2025 ఆగస్టు నుంచి 2026 ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల వివరాలతో కూడిన స్మారక పుస్తకాన్ని ఆర్ఎస్ఐ కె. గోపికృష్ణ జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు. జాయింట్ కలెక్టర్ పుస్తకాన్ని ఆవిష్కరించి జిల్లా ఎస్పీకి అందజేయగా, అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. బలిమెల దాడిలో వీరమరణం పొందిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పి. సుధీర్ బాబు కుటుంబ సభ్యులతో పాటు, గత ఏడాది కాలంలో జిల్లా పోలీసు విభాగంలో పనిచేస్తూ మరణించిన ఏఆర్ఎస్ఐ-1563 ఐకెడివి ప్రసాద్, ఏఆర్ పీసీ-2794 ఎన్. కన్నయ్య, హెచ్‌సీ-1879 డి. ఏడుకొండలు, పీసీ-1527 ఎస్.వి.వి.ఎస్. కృష్ణారావు, ఏఆర్ పీసీ-2759 జి. విజయకృష్ణ కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్, ఎస్పీ ప్రత్యేకంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ మాట్లాడుతూ, దేశ ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ మూలస్తంభమని, వాటిని కాపాడటంలో పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ సరిహద్దుల రక్షణ కోసం చైనా బలగాలతో పోరాడుతూ ప్రాణాలర్పించిన సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలను పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గుర్తు చేస్తుందన్నారు. విపత్తులు, ఎన్నికలు, శాంతిభద్రతల పరిరక్షణ వంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు ధైర్యసాహసాలతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు పండుగలు, సంతోష సమయాల్లో కుటుంబాలతో గడుపుతున్నప్పటికీ, పోలీసులు సెలవులతో సంబంధం లేకుండా 24 గంటలూ ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ, అంతర్గత భద్రతను కాపాడుతూ ఉగ్రవాదం, మావోయిజం, అసాంఘిక శక్తులను ఎదుర్కొనే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదన్నారు. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 154 మంది పోలీసులు అమరులయ్యారని పేర్కొంటూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.వి.వి. సత్యనారాయణ, భీమవరం ఆర్డీఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ రఘువీర్ విష్ణు, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ బి. నరసింహారావు, జిల్లా ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్. సత్యనారాయణ, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్. మోజేష్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.