జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు : జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పశ్చిమ గోదావరి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జిల్లా పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేసుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండవ రోజు కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు.
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని కలెక్టర్ తెలిపారు. నరసాపురం, ఆకివీడు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు.
ముందుగా భీమవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రమణ, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.