ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి…. ఓటర్ల నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 24/10/2026
WhatsApp Image 2026-10-24 at 3.08.09 PM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి….

ఓటర్ల నమోదుపై విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో శనివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు.

ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా పాఠశాలలో, ఇంజినీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు, పీజీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఎన్నికల నిబంధనలు, ఓటరుగా నమోదు పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఓటరు నమోదుకు నిర్దేశించిన అర్హతలు, బోధనా అనుభవ నిబంధనలు, ఇతర షరతులపై స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. విద్యాసంస్థల వారీగా అర్హులైన వారి వివరాలను సేకరించి, నిర్ణీత గడువులోగా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇప్పటివరకు మొత్తం 839 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. వీరిలో 808 మంది ఆఫ్‌లైన్ ద్వారా, 31 మంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. 2024 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జిల్లాలో సుమారు 3,500 మంది ఓటర్లుగా నమోదయ్యారని పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో అర్హులైన ఓటర్ల నమోదు సంఖ్య పెరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రతినిధులు ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ అన్నారు. అయితే, శశి, స్వర్ణాంధ్ర, విష్ణు, డీఎన్‌ఆర్, నారాయణ, చైతన్య, వెస్ట్ బెర్రీ, ఆదిత్య తదితర ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరుకాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత విద్యాసంస్థల ప్రతినిధులను మరుసటి రోజు పిలిపించి, జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డీఆర్వో, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకోవడంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఉపాధ్యాయుడికి వివరించి, అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. గ్లోరియా, కేఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ పి. ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.