మేరా యువ భారత్ ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి..
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువజన సేవలు, దేశ నిర్మాణ వేదిక ‘మేరా యువ భారత్’ విస్తృత ప్రచార గోడ పత్రికను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం కలెక్టరేట్లో పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. యువతలో దేశభక్తి, స్వచ్ఛంద సేవ, నాయకత్వ లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక రిజిస్ట్రేషన్ మరియు అవగాహన డ్రైవ్ పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో యువశక్తే కీలకమని, యువత అంతా ఈ వేదికలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా జూలై 01, 2026 నుండి ఆగస్టు 15, 2026 వరకు ఈ ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.రిజిస్ట్రేషన్ ద్వారా యువతకు కలిగే ప్రయోజనాలను ఆమె వివరించారు. సమాజ సేవలో భాగస్వామ్యం కావడం వల్ల క్షేత్రస్థాయి అనుభవం, సరికొత్త నైపుణ్యాల అభ్యాసం కలుగుతుంది అన్నారు. ఇందులో వ్యాస రచన, పోస్టర్ మేకింగ్, క్విజ్, డిబేట్ వంటి పోటీలలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. లీడర్షిప్ ప్రోగ్రామ్స్, యూత్ క్యాంపులలో ఉచిత ప్రవేశం ఉందని, శిక్షణా తరగతులు, ప్రత్యేక వర్క్‌షాప్‌ల నిర్వహణ జరుగుతుందన్నారు . ఈ దృవపత్రాలకు ప్రతి కార్యక్రమానికి ఈ-సర్టిఫికెట్లు మరియు జాతీయస్థాయి గుర్తింపు ఉందన్నారు.
జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, NSS, NCC, NYVS (నెహ్రూ యువ కేంద్ర సంఘటన్) వాలంటీర్లు, యువజన సంఘాల సభ్యులు మరియు సాధారణ యువతీ యువకులు అందరూ ఈ వేదికలో పేరు నమోదు చేసుకోవడానికి అర్హులని కలెక్టర్ తెలిపారు. పోస్టర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి వెంటనే విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ ప్రభాకర్, డిస్టిక్ యూత్ ఆఫీసర్ రాహుల్ రెడ్డి, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, ఎస్ జి ఎస్ డబ్ల్యు అధికారి వెంకటలక్ష్మి, పి జి ఆర్ ఎస్ పర్యవేక్షకులు దోసి రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.