Close

27 విడతల్లో 401 దరఖాస్తులకు పరిష్కారం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 28/07/2026

భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ క్లినిక్స్ సమర్థవంతమైన వేదిక

రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తూ ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్ తో పాటు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్లినిక్స్ ద్వారా ప్రజల భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 2025 డిసెంబర్ 29న ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 2026 జూలై 27 నాటికి మొత్తం 27 విడతలు నిర్వహించామని తెలిపారు. ఈ కాలంలో జిల్లావ్యాప్తంగా 1016 దరఖాస్తులు అందగా, వాటిలో 401 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందన్నారు. నిబంధనలకు అనుగుణంగా 230 దరఖాస్తులను తిరస్కరించగా, ప్రస్తుతం 385 దరఖాస్తులు వివిధ దశల్లో పరిష్కార ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు. డివిజన్‌ల వారీగా వివరాలను వెల్లడిస్తూ, భీమవరం డివిజన్ పరిధిలోని ఏడు మండలాల నుంచి 451 దరఖాస్తులు అందాయని, వాటిలో 172 దరఖాస్తులను పరిష్కరించగా, 96 దరఖాస్తులను తిరస్కరించామని, 183 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. నరసాపురం డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల నుంచి 359 దరఖాస్తులు అందగా, 154 దరఖాస్తులను పరిష్కరించామని, 84 దరఖాస్తులను తిరస్కరించామని, 121 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలోని ఐదు మండలాల నుంచి 206 దరఖాస్తులు అందగా, 75 దరఖాస్తులను పరిష్కరించామని, 50 దరఖాస్తులను తిరస్కరించామని, మిగిలిన 81 దరఖాస్తులపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. భూ సమస్యలకు సంబంధించి అందిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలకు సత్వర, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతమవుతోందని, భూ హక్కులకు సంబంధించిన సమస్యలు ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.