జిల్లా కలెక్టర్ ను కలిసిన జాతీయ మలేరియా నివారణ బృందం
పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయ మలేరియా నివారణ బృందం జిల్లా లోమూడు రోజుల పర్యటన అనంతరం బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మర్యాదపూర్వకంగా కలిసి క్షేత్రస్థాయిలో వైద్య సేవలు, మలేరియా నివారణ చర్యలను పరిశీలించిన తీరును జిల్లాను మలేరియా రహితంగా మార్చేందుకు తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది.
ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మలేరియా నివారణ ఉన్నత స్థాయి బృందం జూలై 27, 28, 29 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. ఈ మూడు రోజుల్లో కేంద్ర బృందం సభ్యులు తణుకు, ఆకువీడు, పాలకొల్లు, నర్సాపురం మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. పర్యటనలో భాగంగా స్థానిక ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHC), ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను సందర్శించి అక్కడి ఆరోగ్య వసతులను నిశితంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రయోగశాలలు (ల్యాబొరేటరీలు), ఔషధశాలలను తనిఖీ చేసి, మలేరియా నిర్ధారణ కిట్లు మరియు అవసరమైన మందుల లభ్యతపై ఆరా తీశారు. పీహెచ్సీలలోని అధికారిక రిజిస్టర్లను, ప్రతిరోజూ వచ్చే ఓపీ (OP) వివరాలను పరిశీలించడంతో పాటు, జ్వరం కేసుల నమోదు సరళిని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం స్థానిక వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు సకాలంలో వైద్యం అందించాలని, జ్వర బాధితులందరికీ తప్పనిసరిగా రక్త పరీక్షలు నిర్వహించాలని స్పష్టమైన దిశా నిర్దేశం చేసింది. అలాగే స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై మలేరియా రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వ్యాధి బారిన పడితే పాటించాల్సిన నియమాలపై విస్తృత అవగాహన కల్పించారు. దోమల నివారణకు గ్రామాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఫాగింగ్ మరియు యాంటీ లార్వా పిచికారీ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ గా పాటించి పరిసరాలను పొడిగా ఉంచుకునేలా ప్రజలను చైతన్యపరచాలని, మలేరియా రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేంద్ర బృందం పిలుపునిచ్చింది.
ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మలేరియా నివారణ బృందంలో డాక్టర్ అమిత్ కుమార్ మిశ్రా, డాక్టర్ లిట్కోల్ డిబాసిస్ మజుబార్, డాక్టర్ రియాస్ కైత పరంబాత్ లు ఉన్నారు. వారికి సహాయంగా జిల్లా నుంచి డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం రవిబాబు, జిల్లా మలేరియా అధికారి వి క్రాంతి కుమార్, ఏ ఎం ఓ వై నాగబాబు, ఎల్ టి నరేష్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు ఉన్నారు.