Close

విద్యా, వైద్య రంగాలలో పశ్చిమగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలపాలి.

Publish Date : 29/07/2026

**ఇరవై సూత్రాల కార్యక్రమం ( వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్.

విద్య, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాలలో వికసిత్ పశ్చిమగోదావరి జిల్లాగా రూపుదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలు, ప్రాజెక్టు అమలు పై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆక్వా వ్యాపార సమస్యలు, ఆరోగ్యం, విద్య, అమృత్, జలజీవన్ మిషన్, పియం సూర్య ఘర్, వికసిత్ భారత్ ఉపాధి హామీ అంశాలపై బుధవారం పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్-స్వర్ణ ఆంద్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేకమైన పథకాలు, ప్రాజెక్టు అమలు పనులు పురోగతి , పనితీరును, నిర్దిష్టమైన ప్రభుత్వ పథకాలు పనితీరును, ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తయ్యాయి, వాటి అమలు చేయడంలో ఏమైనా సమస్యలు, ఆలస్యం, నిధుల వినియోగం, అనుకున్న లక్ష్యాలు పూర్తయ్యాయ లేదా వంటి పలు అంశాల పై జిల్లా అధికారులతో శాఖల వారిగా సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ

మత్స్య శాఖ జిల్లాలో 83,722 ఎకరాలలో చేపలు 47,714 ఎకరాల విస్తీర్ణంలో రొయ్యలు సాగు చేయటం జరుగుతుందని అన్నారు. 2024 – 25 సంవత్సరానికి 20,330 కోట్ల రూపాయల జివిఎ తో 8.05 లక్షల మెట్రిక్ టన్నులు, 2025-16 సంవత్సరములో 24,345 కోట్ల రూపాయల జి. వి.ఎ తో 9.64 లక్షల మెట్రిక్ టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తిని సాధించిందని అన్నారు. ఆక్వారంగానికి ఎదురయ్యే సమస్యలను వివరించేందుకుగాను ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికల ద్వారా ముందుకు వెళుతుందని అన్నారు. అత్యుత్తమమైన మానవ వనరులుగా రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. చేపలు, రొయ్యలు ఎగుమతి దారులు తమ సంస్థలను తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి జిల్లాలో 1 జిల్లా ఆస్పత్రి, 4 ఏరియా ఆసుపత్రులు, 3 సిహెచ్ సిలు, 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 535 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, 4 ఈఎస్ఐ డిస్పెన్సరీలు, 12 ఆయుష్ కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం 22బెడ్స్, తణుకు 15 బెడ్స్, భీమవరం 10 బెడ్స్, ఆకివీడు మండలాలలో డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని అన్నారు. జిల్లాలో 19 నుండి 40 సంవత్సరాల వయసు వారికి ముఖ్యంగా ఐదు నుండి 19 సంవత్సరాల వారికి, గర్భిణీ స్త్రీలకు అవసరమైన వైద్యం అందించి మందులు పంపిణీ చేస్తూ “అనీమియా ముక్త్ భారత్” పథకం అమలుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద జిల్లాలో ప్రతి 15 రోజులకు ఒకసారి ముందస్తు కాన్పులను తగ్గించడానికి స్కాన్లు, రక్త పరీక్షలు చేయటం జరుగుతుందని అన్నారు. ప్రతినెల 9 నుండి 10వ తేదీ లోపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో గైనకాలజిస్ట్ విభాగం ద్వారా గర్భిణీ స్త్రీలకు అన్ని పరీక్షలు, సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2025-26 సంవత్సరానికి నూరు శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగాయని అన్నారు. గత సంవత్సరం 1 ఏప్రిల్ 2025 నుంచి 2026 మార్చి 31 వరకు మరియు 2026-27 సంవత్సరానికి ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన శిశులకు సంబంధించి గర్భిణీ స్త్రీలకు పోషక ఆహారం కోసం జనని సురక్ష యోజన ద్వారా 700 రూపాయలు, సుఖీభవ ద్వారా 300 రూపాయలు వెరసి మొత్తం వెయ్యి రూపాయలు చొప్పున ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. పౌష్టికాహారం ద్వారా వ్యాధి నిరోధక శక్తి, వ్యాక్సిన్ కొరకు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, వంటి ప్రాంతాలలో మొబైల్ ఐసిటిఎస్ ద్వారా ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. ఉచిత క్షయ వ్యాధి నిర్ధారణ, చికిత్స, నిక్షయ్ ద్వారా సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. టీబి చికిత్స సక్సెస్ రేట్ 97% గా ఉందని అన్నారు. పిల్లలు, గర్భిణీలకు ఉచిత టీకాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన బాలింతలకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 3257 రకాల వైద్య చికిత్సలకు ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కొక్కరికి 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందజేయడం జరుగుతుందని అన్నారు. గోల్డెన్ అవర్ సమయంలో రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి ఏడు రోజులలో 1,50,000 రూపాయల వరకు ఉచిత అత్యవసర చికిత్స నిమిత్తం అందజేయటం జరుగుతున్నదని అన్నారు.
*పాఠశాల విద్యాశాఖ కు సంబంధించి జిల్లాలో 1218 ప్రాథమిక పాఠశాలలు, 275 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 550 హైస్కూల్స్, 102 జూనియర్ కళాశాలలు, 26 డిగ్రీ కళాశాలలు, 18 ఐ టి ఐ లు, 8 పాలిటెక్నిక్, 9 ఇంజినీరింగ్ కళాశాలలు, 1 నిట్, 1 ఉద్యాన విశ్వవిద్యాలయం ఉన్నాయని అన్నారు. జిల్లాలో 1379 పాఠశాలలో 86,412 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందించడం జరుగుతుందని అన్నారు. మూడు నుంచి 8 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక చదవడం, రాయడం గణిత నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతున్నదని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా జిల్లాలో88,951 మంది బాల బాలికలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, బెల్టు, షూ వంటి 9 వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్టులను ప్రతి పాఠశాలకు అందజేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారులకు తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని అన్నారు. మధ్యాహ్న భోజనం అమలుతీరును అధికారులు తరచూ తనిఖీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. జిల్లాలో ఎక్కడ డ్రాప్ అవుట్స్ లేకుండా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కళాశాలలలో వృత్తి విద్య కోర్సులను అభ్యసించడం వలన ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి అని అన్నారు.
** అమృత పథకం అమలుపై జిల్లాలోని భీమవరం తాడేపల్లిగూడెం తణుకు పాలకొల్లు నరసాపురం ఆకివీడు నిడదవోలు మునిసిపాలిటీలలో తాగునీటి సరఫరా మెరుగుదల, మురుగునీటి నిర్వహణ, చెరువుల పునరుజ్జీవనం కొరకు 8 ప్రధాన పనులకు గాను 246 కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
* జలజీవన్ మిషన్ కు సంబంధించి జిల్లాలో ప్రతి గ్రామీణ ఇంటికి నాలా కనెక్షన్ అందించడం పథకం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటివరకు 3,09,839 నీటి కనెక్షన్లను అందించడం జరిగిందని అన్నారు. భీమవరం పట్టణంలో ఇప్పుడు ఉన్న స్టోరేజ్ ట్యాంకుల ద్వారా మంచినీటి సరఫరా సమృద్ధిగా జరుగుతున్నదని, రాబోయే కాలానికి ముందస్తుగా స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.
** పీఎం సూర్య ఘర్ పథకం అమలు గూర్చి జిల్లాలో 318 గ్రామాలలో నూరు శాతం విద్యుద్దీకరణ సరఫరా చేయటం జరిగిందని అన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం అమలకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ గృహాల సోలార్రైజేషన్ క్రింద 22,855 మంది వినియోగదారులకు ప్రతిపాదించగా 6,271 మంది లబ్ధిదారులకు ఇన్స్టాలేషన్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సమీక్ష సమావేశం సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు ప్రగతి గురించి కమిటీ చైర్మన్ లంకా దినకర్ కు శాఖల వారీగా వివరించారు. వచ్చే సమావేశం నాటికి జిల్లాలో పథకాల అమలు ప్రగతి, కార్యాచరణ ప్రణాళిక పై మరింత దృష్టి కేంద్రీకరించి జిల్లా స్వర్ణాంధ్ర దిశగా పయనించేందుకు కృషి చేయడం జరుగుతుంది అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, డి ఆర్ ఒ కె. ప్రభాకర్, భీమవరం ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, సిపిఒ శివ పార్వతి తదితరులు ఉన్నారు.