Close

తప్పులు లేని, ఖచ్చితమైన ఓటర్ల జాబితా కోసమే ‘సర్’ కార్యక్రమం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 10/06/2026

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన “సర్” కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుసుకొని, వారి వివరాలను ధృవీకరించడం ద్వారా తప్పులు లేని, శుద్ధమైన మరియు ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బుధవారం ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని “సర్” కార్యక్రమంపై సవివరంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు జిల్లాలోని బూత్ లెవల్ అధికారులు (బి.ఎల్.ఓలు) ఇంటింటి పర్యటనలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరుకు పాక్షికంగా నింపబడిన ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి, ఓటర్లు అవసరమైన సమాచారాన్ని పూర్తి చేసిన అనంతరం వాటిని తిరిగి సేకరిస్తారని వివరించారు. ఓటర్లు తమ వివరాలను లేదా తమ కుటుంబ సభ్యుల వివరాలను 2002 ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ రికార్డులతో అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఎలక్టోరల్ ఫారంపై సంబంధిత బి.ఎల్.ఓ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సందేహాలు ఉన్నా బి.ఎల్.ఓలను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సి.ఈ.ఓ) వెబ్‌సైట్‌లో కూడా తమ వివరాలను తనిఖీ చేసుకునే అవకాశం ఉందన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా జూలై 21న ప్రచురించబడుతుందని, ఆ తేదీ నుండి ఆగస్టు 20 వరకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. అందిన క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతుందని, అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ బి.ఎల్.ఓలకు సహకరించి, సరైన వివరాలు అందజేసి ఓటర్ల జాబితా శుద్ధీకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బిఎల్ఓలు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.