Close

అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 03/06/2026

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత మరియు పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఖచ్చితమైన ఓటర్ల జాబితా ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (Special Intensive Revision – SIR) నిర్వహణపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దారులు, ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పౌరుని పేరు ఓటర్ల జాబితాలో నమోదు చేయడంతో పాటు మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన మరియు డూప్లికేట్‌గా ఉన్న ఓటర్ల పేర్లను నిర్ధారిత విధానంలో తొలగించాలని అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో ఖచ్చితత్వంతో ఉండేలా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం జూన్ 5 నుండి 14 వరకు ట్రైనింగ్ మరియు ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జూన్ 15 నుండి జూలై 14 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడతారని చెప్పారు. జూలై 14న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టడంతో పాటు జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులపై అభ్యంతరాలు, సవరణల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అలాగే జూలై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు అందిన దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది నిర్ణయాలు తీసుకుని సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. 2002 సంవత్సరపు ఓటర్ల జాబితాతో కొత్తగా రూపొందించే తుది జాబితాను అనుసంధానం చేయనున్నట్లు వివరించారు. బూత్ లెవెల్ అధికారులు బాధ్యతాయుతంగా ఇంటింటి పరిశీలన నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం ఫారం-7, వివరాల సవరణ లేదా అదే నియోజకవర్గంలో చిరునామా మార్పు కోసం ఫారం-8 ద్వారా ఆన్‌లైన్‌లో లేదా బీఎల్ఓ, వీఆర్‌ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం మొత్తం 14,74,981 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు. వీరిలో 7,22,178 మంది పురుషులు, 7,52,723 మంది మహిళలు, 80 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు. ఓటర్ల మ్యాపింగ్‌కు సంబంధించిన పురోగతి, వ్యత్యాసాల సవరణలు మరియు తదుపరి చర్యలపై సమావేశంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2002 మరియు 2025 సంవత్సరాలకు సంబంధించిన ఓటర్ల మ్యాపింగ్ నివేదికలను పూర్తి సమాచారంతో సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డిపిఓ వై.దోసిరెడ్డి, ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, రెవెన్యూ అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.