Close

తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి కి శాశ్వత రహదారికి కృషి చేస్తానని ప్రకటించిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ

Publish Date : 04/06/2026

మారంపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి భూమి కొనుగోలుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రూ.10 లక్షల ఔదార్యం

రైతులకు రూ.20 లక్షల అడ్వాన్స్ పంపిణీ

తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి రూ.10 లక్షలు అందించగా, గ్రామస్తుల విరాళాల రూపంలో మరో రూ.10 లక్షలు సమీకరించి మొత్తం రూ.20 లక్షలను భూమి నష్టపోతున్న ఆరుగురు రైతులకు అడ్వాన్స్‌గా అందజేశారు.

భీమవరం కలెక్టరేట్‌లోని వశిష్ట సమావేశ మందిరంలో గురువారం మారంపల్లి గ్రామ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

పీఎం గతి శక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ-379 నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేయబడే పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను కేంద్ర మంత్రి మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సుమారు 1.20 ఎకరాల భూమి అవసరమవుతుందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. అయితే ఈ భూమి 2016 సంవత్సరం నుండి 22(ఏ) జాబితాలో నమోదు కావడంతో సమస్య తలెత్తింది. సంబంధిత భూమి గ్రామ సముదాయ భూమిగా రికార్డుల్లో నమోదై ఉండటంతో దేవాదాయ శాఖకు చెందినదిగా పరిగణించబడుతోంది. అయితే ఈ భూమి తమ స్వంత భూమేనని, గత ప్రభుత్వం 22(ఏ)లో చేర్చిందని రైతులు పేర్కొంటూ 22(ఏ) తొలగించి తమ హక్కులను పునరుద్ధరించాలని అధికారులను కోరారు. ఈ విషయమై స్పందించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భూమి వివరాలను ఎండోమెంట్స్ కమిషనర్‌కు పంపించి 22(ఏ) తొలగింపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ లోపు గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రైతుల నుండి భూమి పొందడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి రూ.10 లక్షలు, గ్రామస్తుల నుండి సేకరించిన విరాళాల రూపంలో మరో రూ.10 లక్షలు సమీకరించి మొత్తం రూ.20 లక్షలను ఆరుగురు రైతులకు అడ్వాన్స్‌గా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పీఎం గతి శక్తి పథకం కింద ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల కొన్ని గ్రామాల్లో రహదారి సమస్యలు తలెత్తుతున్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మారంపల్లి సమస్యను స్థానిక ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకువచ్చారని, ప్రస్తుతం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి 22(ఏ)లో ఉండటంతో జిల్లా కలెక్టర్ సీసీఎల్‌ఏకు ప్రతిపాదనలు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో కూడా తనవంతు సహకారం అందిస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మారంపల్లి రహదారి సమస్యను ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకువచ్చారని, నూతన రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి ప్రస్తుతం 22(ఏ)లో నమోదై ఉండటంతో ఎండోమెంట్స్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించి 22(ఏ) తొలగింపునకు కృషి చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 50 నుండి 60 సంవత్సరాలుగా సరైన రహదారి సౌకర్యంలేక మారంపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతులు పొలాల నుండి పంటలను తరలించేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్ఓబీ నిర్మాణంతో రైల్వే స్థలంలో సాగుతున్న రాకపోకలు కూడా నిలిచిపోతాయని, గ్రామానికి పూర్తిగా రహదారి లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి భూమి సేకరణ చేపట్టినట్లు తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా, గ్రామ ప్రజలకు శాశ్వత రహదారి సౌకర్యం కల్పించేలా అన్ని విధాలా కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం తహసిల్దార్ టి.రాజరాజేశ్వరి, స్థానిక ప్రజాప్రతినిధి చిన్న బాబు, మారంపల్లి రైతులు, తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలోని శశి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & ఇంజనీరింగ్‌లో ఎన్‌సీసీ వార్షిక శిక్షణా శిబిరం ప్రారంభం

600 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో 10 రోజుల పాటు వార్షిక శిక్షణా శిబిరం – గ్రూప్ సెలక్షన్ క్యాంప్ నిర్వహణ

ఎన్‌సీసీ యూనిట్ ఆధ్వర్యంలో సుమారు 600 మంది ఎన్‌సీసీ క్యాడెట్ల కోసం తాడేపల్లిగూడెంలోని శశి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 04 నుండి జూన్ 13, 2026 వరకు వార్షిక శిక్షణా శిబిరం – XII మరియు గ్రూప్ సెలక్షన్ క్యాంప్ (IGC – TSC) నిర్వహిస్తున్నట్లు కల్నల్ కమాండింగ్ ఆఫీసర్ అమిత్ పాండే తెలిపారు. ఈ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ కళాశాలలు, విద్యాసంస్థల నుండి ఎంపికైన ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొంటున్నారు. క్యాడెట్లలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతాభావం పెంపొందించేందుకు ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. శిబిరం సందర్భంగా క్యాడెట్లకు డ్రిల్, మ్యాప్ రీడింగ్, ఆయుధ వినియోగంపై అవగాహన, వ్యక్తిత్వ వికాసం, యోగా, ఫిజికల్ ట్రైనింగ్, ఫైరింగ్, విపత్తు నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు తదితర అంశాలలో శిక్షణ అందించనున్నారు. అలాగే థాల్ సైనిక్ క్యాంప్ (TSC) కోసం నిర్వహించే గ్రూప్ సెలక్షన్ ప్రక్రియలో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లను తదుపరి రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. క్యాడెట్లలో దేశ సేవా భావనను పెంపొందించడమే ఎన్‌సీసీ ప్రధాన లక్ష్యమని, యువతలో క్రమశిక్షణ, సమయపాలన, జాతీయ సమైక్యతను పెంపొందించడంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తోందని కల్నల్ అమిత్ పాండే పేర్కొన్నారు. ఈ శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు శశి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & ఇంజనీరింగ్ యాజమాన్యం అవసరమైన వసతులు కల్పించిందని ఆయన తెలిపారు.