Close

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 05/06/2026

జూన్ 9 ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

చకచకా కొనసాగుతున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు

రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 9వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో కొనసాగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ నిర్మాణ పనులు, సభాస్థలి ప్రాంతం, ప్రజల రాకపోకల మార్గాలు, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ప్రతిష్టాత్మకంగా జరిగే కార్యక్రమమని, అందువల్ల ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను నిర్ణీత గడువులో పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. భోజన ఏర్పాట్లు, త్రాగునీటి సదుపాయం, సీటింగ్ వ్యవస్థ, రవాణా సౌకర్యాలు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించి సంబంధిత శాఖలకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి రావడం సంతోషకరమైన విషయమన్నారు. పర్యటన ఏర్పాట్లను అధికారులు సమయానికి పూర్తి చేసి విజయవంతం చేయాలని కోరారు. అన్ని శాఖలు సమిష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు దాసిరాజు, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.