సీఎం పర్యటన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవు
కేటాయించిన విధులలో తప్పిదాలకు సంబంధిత అధికారులే బాధ్యులు
పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా చేయాలి
…. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జూన్ 8వ తేదీ సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధాంతం పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఉదయం నుండి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలి, హెలిపాడ్, పార్కింగ్ ప్రాంతం, క్యాడర్ మీటింగ్ ప్రాంగణం తదితర ప్రాంతాలను ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సందర్శించి సంబంధిత అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని, కేటాయించిన బాధ్యతల్లో జరిగే తప్పిదాలకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసే రైతులకు ముందస్తుగా సమాచారం అందించి, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే రైతులు, ప్రజలకు తాగునీరు, వైద్యసేవలు, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం ఎండలు, వేడి గాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో తాగునీటి కొరత లేకుండా చూడాలని, వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామ సభకు హాజరయ్యే రైతులకు అల్పాహారం, భోజన ఏర్పాట్లు నాణ్యతతో నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయాలని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి ప్రతి శాఖ అధికారి సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.
ఈ పరిశీలనలో ఆర్డీవోలు దాసిరాజు, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.