Close

ఘనంగా నిర్వహించిన సమగ్ర శిక్ష సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 09/06/2026

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అత్యంత ప్రేమ, శ్రద్ధతో చూసుకోవాలి

326 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ

ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు) గల విద్యార్థులను అత్యంత ప్రేమ, శ్రద్ధతో ఆదరించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. మంగళవారం భీమవరం పట్టణంలోని పిపి రోడ్‌లో ఉన్న ప్రత్యేక మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో పాఠశాల విద్య సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం”లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు సమాజానికి అమూల్యమైన సంపద అని, వారి శారీరక పరిమితులు వారి ప్రతిభను ఎప్పటికీ అడ్డుకోలేవని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ స్వప్నాలను సాకారం చేసుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం విద్య, వైద్యం, పునరావాసం, సహాయక పరికరాలు, ప్రత్యేక శిక్షణ తదితర రంగాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తూ పిల్లల సామర్థ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్యాంగుల పాఠశాలలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు.

సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్ మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సహిత విద్య కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 19 మండలాల్లో భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నామని, ఆర్పీడబ్ల్యూడీ చట్టం–2016 ప్రకారం 0 నుండి 18 సంవత్సరాల వయస్సు గల మానసిక, బధిర, అంధత్వం, శారీరక తదితర 21 రకాల వైకల్యాలు గల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగ పిల్లల ప్రజ్ఞా స్థాయిలకు అనుగుణంగా విద్యాబోధన నిర్వహిస్తున్నామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సమగ్ర శిక్ష ద్వారా రవాణా భత్యం, ఎస్కార్ట్ అలవెన్స్, హెచ్‌బీఈ అలవెన్స్, గర్ల్స్ స్టైఫండ్ తదితర పథకాల కింద రూ.61 లక్షలను నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను క్షేత్రస్థాయిలో గుర్తించి, వైద్య నిపుణులు మరియు ప్రత్యేక విద్యా నిపుణుల సూచనల మేరకు వారికి అవసరమైన సహాయక పరికరాలను ఎంపిక చేసి అందిస్తున్నామని తెలిపారు. ఈ పరికరాలు విద్యార్థుల విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడంతో పాటు వారి దైనందిన జీవితంలో స్వతంత్రతను పెంపొందించేందుకు దోహదపడతాయని వివరించారు.

అనంతరం నిర్వహించిన ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమంలో 326 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్, కమోడ్ వీల్‌చైర్లు, వీల్‌చైర్లు, టీఎల్‌ఎం కిట్లు, క్రచ్‌లు, ట్రైసైకిళ్లు, స్క్రీన్ రీడర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లు, బ్రెయిల్ కిట్లు తదితర పరికరాలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం విశేషంగా ఆకట్టుకుంది. తమ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారి కలలకు కొత్త రెక్కలు తొడిగే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరిగింది. కార్యక్రమ ప్రాంగణం చిన్నారుల ఆనంద కేరింతలు, తల్లిదండ్రుల సంతోషం, ఉపాధ్యాయుల అభినందనలతో ప్రత్యేక వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సమగ్ర శిక్ష డిటిసిలు దీవెనమ్మ, చంద్రశేఖర్, ఎంఈఓలు, సమగ్ర శిక్ష అభియాన్ అకౌంట్స్ అధికారులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతర అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2.111