యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలి
అన్ని శాఖల సమన్వయంతో లక్ష్య సాధనకు కృషి చేయాలి
జూన్ 11వ తేదీన నరసాపురం వలందర్ రేవు వద్ద 1000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం
…. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి యోగాంధ్ర–2026 కార్యక్రమంపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4.5 లక్షల మంది పౌరులతో యోగ రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమిష్టిగా కృషి చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యోగ కేంద్రాలు, యోగపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. యోగాభ్యాసం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు. యోగా ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసే విధంగా గ్రామ, మండల, పట్టణ స్థాయిలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 7వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహణకు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో కూడా ప్రతిరోజు గ్రామ, మండల, పురపాలక సంఘాల పరిధిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు భాగస్వాములై కార్యక్రమాలను మరింత విజయవంతం చేయాలని కోరారు. జూన్ 14న వాసవి పెనుగొండలో 2500 మందితో, జూన్ 19న స్పోర్ట్స్ అథ్లెటిక్స్ మైదానంలో 1500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయిలో 1500 మందితో మెగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో యోగాసనాలు, క్విజ్, పెయింటింగ్, వ్యాసరచన తదితర అంశాలపై వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలని సూచించారు. జిల్లాలో నిర్వహించే యోగా కార్యక్రమాలకు సంబంధించిన నాణ్యమైన ఫోటోలను యోగాంధ్ర యాప్‌లో అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు భాగస్వాములై యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.