Close

స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం ఆరోగ్యవంతంగా ఉంటుంది

Publish Date : 07/03/2026

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ

సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం మహిళలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలికకు హెచ్‌పి‌వి (HPV) వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు.

కాళ్ళ మండలం పెదఅమిరం వెస్ట్ బెర్రీ ఉన్నత పాఠశాలలో శనివారం లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316 జి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. భీమవరం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పి‌వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, సమాజం, దేశం ఆరోగ్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల ప్రతి బాలికకు ఈ వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని కోరారు. ఈ వ్యాక్సిన్ ద్వారా సర్వికల్ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. సుమారు రూ.32 వేల విలువైన ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్‌ను మంత్రి అభినందించారు. 9–14 సంవత్సరాల బాలికలకు రెండు డోసులు, 14–45 సంవత్సరాల మహిళలకు మూడు డోసులు ఇవ్వడం ద్వారా సర్వికల్ క్యాన్సర్‌ను నివారించవచ్చని వివరించారు. లయన్స్ క్లబ్ చేపట్టే ప్రతి సామాజిక కార్యక్రమానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం స్థానిక అక్షర ఆసుపత్రిలో వ్యాక్సిన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం 9 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికకు ఈ వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా ఈ వ్యాక్సిన్ అందించడం అభినందనీయమన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బాలికలు, మహిళలు సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్న నేపథ్యంలో హెచ్‌పి‌వి వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చన్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. మహిళలు తమ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని కోరారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్‌ను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎన్.వి.వి.ఎస్.పాపారావు నాయుడు, లయన్స్ ప్రతినిధులు సి.హెచ్. కృష్ణంరాజు, ఎం.శ్రీనివాస్, డి.సుబ్బారావు, ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు, కె.వేణుబాబు, ఎ.సుధాకర్ రెడ్డి, పి.సుభాష్ బాబు, వి.విజయ్ కుమార్ రాజు, ఎం.శ్రీరామ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.