జిల్లా స్థాయి మహిళా దినోత్సవ వేడుకలకు పక్కా ఏర్పాట్లు చేయాలి
మార్చి 8న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
అమరావతి నుండి ముఖ్యమంత్రి ప్రసంగం లైవ్ టెలికాస్ట్‌కు ఏర్పాట్లు చేయాలి
మార్చి 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణకు జిల్లా కేంద్రంలో విష్ణు కాలేజీ మెయిన్ ఆడిటోరియంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలపై శనివారం కలెక్టరేట్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొనారు. జిల్లా స్థాయి కార్యక్రమంతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని జిల్లా స్థాయి మరియు నియోజకవర్గ స్థాయిలో లైవ్ టెలికాస్ట్ చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించామని తెలిపారు. ఆయా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్‌డీఏ ఏపీఎంలు, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేయాలని, ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ 112 టోల్ ఫ్రీ సేవలు, గృహహింస నిరోధం, వన్ స్టాప్ సెంటర్ సేవలు, బాల్య వివాహాల నిరోధక చట్టం వంటి అంశాలపై అవగాహన కల్పించే ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శక్తి టీమ్, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ఎస్‌సి, ఎస్‌టి, బీసీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖల రుణాలకు సంబంధించిన ప్రదర్శనశాలలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యాపార రంగంలో మంచి పేరు తెచ్చుకున్న మహిళా వ్యాపారవేత్తలను వేదికపైకి ఆహ్వానించి వారి విజయ గాథలను వివరింపజేసి, వారికి ప్రశంసా పత్రాలు అందజేయాలని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా మరియు మండల స్థాయి కార్యక్రమాల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని, అంబులెన్స్ వాహనాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వోకు సూచించారు. కార్యక్రమ ప్రాంగణంలో శానిటేషన్ మరియు తాగునీటి ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జ్ అధికారులు ఏర్పాట్లను సమీక్షిస్తూ స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులను కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. పోలీస్ శాఖ బందోబస్తు మరియు లా అండ్ ఆర్డర్ పరిస్థితులను పర్యవేక్షించాలని, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో డీఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి డి.శ్రీలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ ఎమ్‌ఎస్‌ఎస్ వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి అప్పారావు, సిపిఓ కె.శివ పార్వతి, మెప్మా అధికారి నాని బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.