వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ
హాస్టల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించాలి
భద్రతా చర్యలు కచ్చితంగా పాటించాలి
…జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
పెనుగొండలోని వాసవి వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థినులకు అందుతున్న వసతులు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లపై ఆమె నిశితంగా సమీక్ష నిర్వహించారు. తనిఖీ సందర్భంగా హాస్టల్ పరిసరాలు, విద్యార్థినులు నివసిస్తున్న గదులు, భోజనశాల, వంటగది, నిల్వ గదులు, త్రాగునీటి సదుపాయాలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్లో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థినులు నివసిస్తూ చదువుకుంటున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు నమోదు పుస్తకాలు, హాస్టల్ రిజిస్టర్లను పరిశీలించి అందుబాటులో ఉన్న సదుపాయాలు విద్యార్థినుల అవసరాలకు సరిపోతున్నాయా అని ఆరా తీశారు. ముఖ్యంగా బాత్రూములు, మరుగుదొడ్లు విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్వాహకులను ప్రశ్నించారు. అవసరమైతే అదనపు సౌకర్యాలు వెంటనే కల్పించాలని ఆదేశించారు. హాస్టల్లో అన్ని మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భోజనం నాణ్యత, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, పడకగదుల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థినులు ప్రశాంతంగా చదువుకునేలా అనుకూలమైన వాతావరణం కల్పించడం నిర్వాహకుల బాధ్యత అని స్పష్టం చేశారు. హాస్టల్ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బాలికల భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభ్యాస విషయాల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వసతి గృహం అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జి.అనిత కుమారి, వసతి గృహ సంక్షేమ అధికారి వై.పద్మజ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.