కేసుల విచారణను సంయుక్తంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి
నిషేదిత భూముల జాబితా – 22-ఎ కు దరఖాస్తులు విచారణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా యంత్రాంగం
నెలలో ప్రతి మంగళవారం (సెలవు దినాలు మినహా) 22-ఎ కేసుల విచారణ.
నేడు విచారణకు చేపట్టిన 30 కేసులు.. మధ్యాహ్నం ప్రారంభించిన కేసులు విచారణ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది.
భీమవరం కలెక్టరేట్ చాంబర్ నందు మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా వ్యాప్తంగా అందిన నిషేదిత భూముల జాబితా – 22-ఎ కు సంబంధించిన దరఖాస్తులలో నేడు 30 దరఖాస్తులకు సంబంధించి విచారణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులలో పట్టా భూములుగా నమోదై క్రయ, విక్రయాలు జరిగిన భూములు ఆన్లైన్లో 22 ఏ లో చూపించడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, అనారోగ్య సమయాలలో తమ ఆస్తులను అమ్మవలసిన పరిస్థితుల్లో 22- ఏ లో చూపించడం ద్వారా రైతులు అమ్ముకోలేక ఇబ్బందులు పడటం జరుగుచున్నదన్నారు. దీనికి సంబంధించి రైతులు నుండి భూముల క్రమబద్ధీకరణకు పి.జి.ఆర్.ఎస్ ద్వారా ఎక్కువ దరఖాస్తులు రావడంపై రెవెన్యూ శాఖ 22 ఏ కేసులు పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఈ కేసుల విచారణ నిమిత్తం నెలలో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా కేటాయించి, భూమికి సంబంధించిన అన్ని రికార్డులు విచారణ సమయంలో సమర్పిస్తే విచారణ జరిపి నిబంధనల మేరకు సత్వరంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా నిర్వహించిన విచారణలో 09 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. నేడు నిర్వహించిన విచారణలో 14 కేసులను పరిష్కరించగా, భూములకు సంబంధించిన రికార్డులను సమర్పించకపోవడంతో 16 కేసులు వచ్చే వారానికి వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రతి మంగళవారం ఈ కార్యక్రమానికి చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత మండలాల తహసిల్దారులు, డిప్యూటీ తహసిల్దారులు, మండల సర్వేయర్లు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్, దరఖాస్తుదారులు, తదితరులు పాల్గొన్నారు.