ప్రయోగాలు చేసేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు నిరంతరాయంగా ప్రోత్సహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
నేటి చిన్న, చిన్న ప్రయోగాలే రేపటి విజయానికి బాటలు వేస్తాయి..
నూతన ఆవిష్కరణలకు నిరంతరాయంగా ప్రయోగాలు జరగాలి.
ఉండి మండలం మహాదేవపట్నం గాదిరాజు అప్పల నరసింహరాజు జిల్లా పరిషత్ పాఠశాల నందు నిర్వహించిన “సైన్స్ సమగ్ర మహోత్సవ్ -2026” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులు తయారుచేసిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమగ్ర శిక్ష మరియు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ కలిసి సోమవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో “సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2K26” పేరిట విద్యార్థులతో సైన్స్ ఫెయిర్ ప్రదర్శనల నిర్వహణకు ఆదేశించడం జరిగింది. ఆలోచిద్దాం… పరిశీలిద్దాం… కొత్తది నేర్చుకుందాం… సైన్స్ తో భవిష్యత్తును నిర్మించుకుందాం అనే స్లోగన్ తో అన్ని పాఠశాలల్లో 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా ముగ్గురు విద్యార్థులు చొప్పున ఒక జట్టుగా ఏర్పడి గ్రూప్ ప్రాజెక్ట్ తయారు చేసి సమర్పించడం జరిగింది. ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికైన జట్టులకు రాష్ట్రస్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదగా బహుమతి ప్రధానం చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగాలు నిరంతరాయంగా చేపట్టడం ద్వారా ఉత్తమ ప్రాజెక్టును రూపొందించే అవకాశం ఉందన్నారు. నిరంతరాయంగా సాధన ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతామన్నారు. విద్యార్థులు విద్యుతో పాటు వివిధ ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గ నిర్దేశం చేస్తూ వారిని ప్రోత్సహించాలన్నారు. చదువు ఒక్కటే కాదని, అన్ని రంగాలలో పరిణితి సాధించేలా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు.
రుద్రరాజు జానకిరామరాజు, అరుణ దంపతులు దాతృత్వం అభినందనీయం
రుద్రరాజు జానకిరామరాజు, అరుణ దంపతులు, అమెరికాలో స్థిరపడిన వారి కుమారుడు రుద్రరాజు ఉదయ్ కుమార్ రాజు, అలేఖ్య దంపతులు సమకూర్చిన దాతృత్వం రూ.6.50 లక్షల రూపాయల వ్యయంతో ఎస్ జి ఏ ఎన్ ఆర్ జెడ్పి స్కూల్లో నిర్మించిన బహుళ ప్రయోజన ఓపెన్ ఆడిటోరియంను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆడిటోరియం నందు ఏర్పాటుచేసిన షటిల్ కోర్టులో కొద్ది సమయం జిల్లా కలెక్టర్ షటిల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా దాత రుద్రరాజు అరుణను జిల్లా కలెక్టర్ శాలువా కప్పి సన్మానించారు. ఇటువంటి దాతలు సహకారంతో ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది గ్రామ అభివృద్ధికి దోహదపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
పూర్వ విద్యార్థి కేఎన్ఆర్కే రాజు ను స్ఫూర్తి గా తీసుకోవాలి..
జడ్పీ స్కూల్లో చదువుకొని వ్యాపారంలో స్థిరపడిన పూర్వ విద్యార్థి కేఎన్ఆర్ కే రాజు ఆ పాఠశాలలో చదువుతున్న 70 మంది10వ తరగతి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, స్కేల్, తదితర వస్తువులతో కూడిన కిట్ లను సమకూర్చగా వాటిని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థి కేఎన్ఆర్ కే రాజు ను స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఉభయ పశ్చిమగోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తిగ నాగరాజు, డీఈఓ ఇ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యామ్ సుందర్, ఏఎంఓ సిహెచ్ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దా జాన్ బాబు, స్థానిక నాయకుడు వనిమ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.