Close

జిల్లాలో రేపటి నుంచి (సోమవారం) ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Publish Date : 22/02/2026

రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షలు –

జిల్లాలో మొత్తం 53 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

ప్రధమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్న 37,550 మంది అభ్యర్థులు

ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నిరాకరణ

పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్ నిషేధం

పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ తో ప్రత్యేక నిఘా

… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

జిల్లాలో సోమవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు (ప్రభుత్వ దినములు మినహా) షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రం చేరుకోవాలని, మధ్యాహ్నం 12:00 గంటలకు పరీక్ష పూర్తయ్యే వరకు ఎవరిని బయటికి పంపడం జరగదని తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 19,662 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 17,888 మంది మొత్తం 37,550 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నట్లు తెలిపారు. 53 పరీక్ష కేంద్రాలకు 53 మంది చీఫ్ సూపరింటెండెన్స్ ను, 53 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్, మూడు సిట్టింగ్ స్క్వాడ్స్, ముగ్గురు డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్స్, స్టేట్ అబ్జర్వర్ ఒకరు పరీక్షలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, తదితరు ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ తో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడ మాస్ కాపీయింగ్ జరగడానికి వీల్లేదని గట్టిగా హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలలో త్రాగునీటిని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్ష ప్రారంభమైన అరగంట వరకు, పూర్తి అవ్వడానికి అరగంట వరకు టాయిలెట్స్ కి వెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షలు నిర్వహణలో ఏదైనా అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఇంటర్మీడియట్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.