పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, చెత్త నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం దుంపగడప గ్రామం నందు స్వచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. తొలుత స్వచ్ఛ రథాన్ని ఉపసభాపతి, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. గృహాలలో పనికిరాని ప్లాస్టిక్, ఇనప వస్తువులు, పుస్తకాలు, పేపర్లు, తదితర వస్తువులను ఈ వాహనం ద్వారా అమ్మితే వాటి విలువకు సమానంగా వస్తువులను వారు అందజేయడం జరుగుతుంది. పలువురు గ్రామస్తులు చెత్తను వాహనానికి అందించి, వాటి విలువకు తగిన వస్తువులను పొందే ప్రక్రియను ఉపసభాపతి, జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి, స్వచ్ఛ రథం ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా వ్యర్థ రహిత పాలన అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. వీధులలో వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అధికారులకు తెలిపారు. వాణిజ్య సంస్థలు, హోటళ్లలో సింగిల్ యుజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దీని కొరకు ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలన్నారు. మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే వీధులను శుభ్రంగా ఉంచాలని. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. అభివృద్ధి చెందే దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. అభివృద్ధి లక్ష్యంగా స్వచ్ఛత, పరిశుభ్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. పరిశుభ్రతపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటి వద్దనే తడి, పొడి చెత్తలు వేరు చేయాలని సూచించారు. ముఖ్యంగా రేపటి పౌరులుగా ఎదిగే నేటి విద్యార్థులు పరిశుభ్రతపై పూర్తిస్థాయిలో అవగాహన పొందాలన్నారు.
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చెత్తరహిత సమాజ నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని, సింగిల్ యుజ్డ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడైనా వినియోగిస్తే జరిమానాలు విధించాలన్నారు. బయట మార్కెట్లో ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. పారిశుద్ధ్యంపై అందరూ కలిసి పని చేయాలన్నారు. మన ఇంటిని మాదిరిగా మన వీధులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులు పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్రత కార్యక్రమాలపై చిన్నారుల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, పలువురు అధికారులతో కలిసి స్వయంగా చీపురుపట్టి చెత్తను శుభ్రపరిచారు. .
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎన్.రామ్నాథ్ రెడ్డి, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డీఈవో ఇ.నారాయణ, గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.