జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులు సంక్షేమ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థుల ఆరోగ్య విషయాలఫై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి.
జిల్లాలో సంక్షేమ వసతి గృహాలపై జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థుల ఆరోగ్య విషయాల తనిఖీపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాయింట్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ప్రతిరోజు హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి పిల్లల ఆరోగ్య విషయాలు, దినచర్యలపై నివేదికలను అందించాలన్నారు. జిల్లాలోని వసతి గృహాలలో పారిశుధ్యంపై పిర్యాదు రాకుండా చూడాలన్నారు. ఎక్కడైనా హాస్టల్ లో పారిశుధ్యంపై పిర్యాదు వస్తే సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రమణ వ్యాధులు రోజు రోజుకు పెరిగిపోవడంతో సంక్రమణ వ్యాధులపై రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం వన్ హెల్త్ విధానంలో విభాగాల మధ్య సమన్వయంను మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను క్రమం తప్పకుండ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన డిఎం అండ్ హెచ్ ఓ జి.గీతబాయి, డిసిహెచ్ఎస్ పి.సూర్యనారాయణ, ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం అధికారి కె.ఎం కిషోర్, డిఐఓ డా.దేవ సుధా లక్ష్మి , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డిపిఓ ఎన్.రామ్నాథరెడ్డి, డీఈవో ఇ.నారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి అరుణ్ కుమారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.వి సూరిబాబు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పుష్ప రాణి, వివిధ శాఖల అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.