మ్యుటేషన్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
నరసాపురం ఆర్డీవో కార్యాలయంను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించి కొన్ని భూమి, స్థిరాస్తిలకు సంబంధించి యజమాన్యంలో మార్పులను ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసే ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మ్యుటేషన్ ప్రక్రియను వివాదాలకు తావు లేకుండా పక్కగా నిర్వహించాలన్నారు. మ్యుటేషన్ అనేది భూమి యజమాన్యంలో మార్పు వచ్చినప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసే ముఖ్యమైన ప్రక్రియ అన్నారు. ఇది చట్టబద్ధ హక్కుకు ప్రత్యామ్నాయం కాకపోయినా, పరిపాలనా పరంగా చాలా అవసరం అన్నారు. భూమి కొనుగోలు చేయడం, వారసత్వం రావడం జరిగిన వెంటనే మ్యుటేషన్ పూర్తి చేసుకోవాలన్నారు. ఒక భూమి లేదా ఆస్తి యజమాని మారినప్పుడు, ఆ మార్పును గ్రామ, మండల రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో కొత్త యజమాని పేరు నమోదు కావడం వల్ల పన్నులు చెల్లించడం, పాసుబుక్లు పొందడం వంటివాటికి సులువుగా ఉంటుందన్నారు. మ్యుటేషన్ ప్రక్రియకి సంబంధిత మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ డీడ్ కాపీ, పాత పట్టాదారు పాసుబుక్ ఆధార్, గుర్తింపు పత్రాలు, వారసత్వ ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో దాసిరాజు ఉన్నారు.