Close

మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి.

Publish Date : 10/02/2026

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి..

రానున్న ఉగాది నాటికి పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలి…

ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వాటిలో లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మత్తులు చేయించాలి..

మున్సిపల్ కమిషనర్లు పబ్లిక్ టాయిలెట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయా పట్టణాల్లో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణం, డంపింగ్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్లు, బరియల్ గ్రౌండ్స్, పార్క్స్, రోడ్లు, డ్రైన్లు, తదితర ఇంజనీరింగ్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టిడ్కో గృహ నిర్మాణ పనులలో వేగం పెంచాలని, రానున్న ఉగాది నాటికి భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ టిడ్కో.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ .. అందరికీ గృహాలు పథకం కింద భీమవరం పట్టణంలో 8,352 గృహాలు మంజూరు కాగా ఇప్పటివరకు 1,984 గృహాలను అందజేయడం జరిగిందని, ఫిబ్రవరి నెలాఖరు నాటికి మరో 920 గృహాలను సిద్ధం చేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 5,376 గృహాలు మంజూరు కాగా 4,256 గృహాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని, మిగిలిన 1,120 గృహాల పనులను పూర్తిచేసి ఉగాది నాటికి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది అన్నారు. అలాగే పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో 6,144 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటివరకు 2,592 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని, మిగిలిన 3,552 ఇళ్లలో 960 గృహాలకు సంబంధించి చిన్న చిన్న పనులను పూర్తిచేసి రానున్న రెండు వారాల్లో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే తణుకు మున్సిపాలిటీ పరిధిలో 912 గృహాలను మంజూరు చేయగా, ఒక్క గృహం కూడా పూర్తి కాలేదని, 144 గృహాలకు స్లాబులు పూర్తి చేయడం జరిగిందని, 768 గృహాలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు దశలో ఉన్నాయని తెలిపారు. రూ.1,469.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 21,424 గృహ నిర్మాణాలకు రూ.1,239.92 కోట్లను ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు రూ.153.32 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకా మొత్తం 8,992 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, దశలవారీగా నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణ ఏజెన్సీ తో టిడ్కో, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకొని నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం అమృత్ పథకం కింద జిల్లాకు రూ.770 కోట్లు మంజూరు చేయటం జరిగిందని, వీటిలో రూ.430 కోట్లను విజ్జేశ్వరం నుండి పైపులైను నిర్మాణానికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. దీనికి అనుబంధంగా నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకులు, వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్స్ నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో ప్రాజెక్టు అమలుకు ఎన్.సి.సి ని ఏజెన్సీగా ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలోని మున్సిపాలిటీలలో డంపింగ్ యార్డ్ ల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భీమవరం గునుపూడి బర్రెల గ్రౌండ్ పనులపై ఆరా తీశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ నందు డ్రైన్ కు ఇరుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను సుందరీకరణ, పాత్ వే, సిట్టింగ్ బెంచెస్ ఏర్పాట్లకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. అంబేద్కర్ సర్కిల్ ఆర్ యు బి పక్కన ఉన్న కాళీ స్థలాన్ని గేమ్ జోన్ గా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు పురోగతిపై ఆరా తీశారు. తణుకు మినహా మిగతా మున్సిపాలిటీలలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మొత్తం ఎన్ని టాయిలెట్లు ఉన్నాయి, అవి ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, రన్నింగ్ వాటర్ ఉన్నదా, ఏవైనా పాడైపోయినవి కూల్చి కొత్తవి వాటి స్థానంలో కట్టాల్సినవి ఉన్నవా, ఇంకెక్కడైనా కొత్తగా నిర్మాణాలు చేపట్టాలా పూర్తి అంచనాలతో ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. పట్టణ సుందరీకరణ, రోడ్లు, డ్రైన్ లు నిర్మాణాలకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. భీమవరంలో ఉన్న హోమ్ లెస్ పీపుల్స్ షెల్టర్ స్థితిగతులపై క్షేత్రస్థాయిలో తనిఖీ చేయించి నివేదికను ఇవ్వాలన్నారు.

ఈ సమావేశంలో టిడ్కో ఈఈ టి.వి నారాయణరావు, జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ విజయ్, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఈఈ వై.వెంకటరమణ, తణుకు డిఈ ఈశ్వర్ రెడ్డి, పాలకొల్లు ఎఇ సాయి శివరాం, ఆకివీడు ఏఇ, నరసాపురం డిఈ జి వరప్రసాద్ పాల్గొనగా, వర్చువల్ గా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురం మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.