Close

రోడ్లు వేసే ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించిన తర్వాత మాత్రమే రోడ్లు పనులను ప్రారంభించాలి

Publish Date : 05/02/2026

ప్రజలకు మరిన్ని మేరైన సర్వీసులు అందించడానికి సకాలంలో పన్నులు వసూలు చేయాలి….

ప్రజలు వారు పొందుతున్న సర్వీసులకు పన్నులు కట్టడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల అలసత్వం కనిపిస్తుంది…

వివిధ రకాల పన్నులు వసూలు చేయడానికి నిరంతరాయ చర్యలు అవసరం …

గ్రామాలను పరిశుభ్రతగా ఉంచడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలి

భీమవరం పట్టణం లోసరి రోడ్డు లోని విష్ణు కన్వెన్షన్ నందు గురువారం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “పంచాయతీరాజ్ కార్యకలాపాలపై సమీక్ష” సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో పన్నులు, పన్నేతర వసూలు, వర్మిక పోస్ట్ తయారీ, అందుబాటులో ఉన్న ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలు, పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులు, ఐ వి ఆర్ కాల్స్ అభిప్రాయ సేకరణ, తదితర అంశాలపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ సకాలంలో పన్నులు వసూలు చేస్తేనే ప్రజలకు మరిన్ని మెరుగైన సర్వీసులను అందజేయగలుగుతామన్నారు. పన్నుల వసూలలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది అందరూ పన్నులు వసూళ్లులలో శ్రద్ధ కనబరచాలని, రానున్న మూడు రోజుల్లో మంచి ప్రగతి కనిపించాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవోలు ఇన్చార్జులుగా ఉన్న గ్రామాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, కుళాయి పన్ను, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థల పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, సెల్ టవర్స్, చెరువులు తదితర వేలం పాటల పన్నుల ప్రగతిపై అంశాల వారీగా సమీక్షించారు. పన్నులు వసూళ్లలో వెనుకబడిన పంచాయతీ సిబ్బందిని గట్టిగా నిలదీశారు. ప్రజలకు అందిస్తున్న సర్వీసులకు పన్నులను వసూలు చేయకపోతే మళ్లీ తిరిగి వారికి ఏ విధంగా మేలైన సర్వీసులను అందించగలుగుతాం అని ప్రశ్నించారు. పన్నుల వసూళ్లలో ఎవరు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు వారానికి రెండు రోజులు గ్రామాల్లో పన్నుల వసూళ్లపై పర్యవేక్షించాలన్నారు.

గ్రామాలలో పారిశుధ్యం మెరుగుదలకు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి

కొన్ని గ్రామాలలో చెత్త సేకరణ కూడా సరిగ్గా జరగటం లేదని, దీనిపై ప్రజాస్పందన లేదు అనేదే ఎక్కువ శాతం నమోదవుతుందన్నారు. చెత్త సేకరణ పక్కాగా నిర్వహించాలని ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. తూర్పు తాళ్ల, మరికొన్ని ప్రాంతాల్లో ఆవులు, గేదెలను ఇష్టానుసారం రోడ్లపై వదిలేయడంతో ఎంతోమంది ప్రమాదాలకు గురి అవుతున్నారు అన్నారు. సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చి పశువులు రోడ్డు మీదకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీరవాసరం, పాలకొల్లు ఎంట్రన్స్, తణుకు, గొల్లలకోడేరు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్ల పక్కన చెత్త కుప్పలు కనిపిస్తున్నాయన్నారు. రోడ్లు పక్కన చెత్త కుప్పలు కుప్పలుగా వేయకుండా పర్యవేక్షించాలి అన్నారు. ఎస్.డబ్ల్యూ.పి.సి నూరు శాతం వినియోగంలోనికి తీసుకురావాలని ఆదేశించారు.

రోడ్లు వేసే ముందు ఆక్రమణలను తొలగించాల్సిందే

రోడ్లు వేసే ముందు ఎట్టి పరిస్థితుల్లో అక్రమణలను తొలగించిన తర్వాతనే రోడ్డుపనుల ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్డు మార్జిన్ లో ఆక్రమణలు కారణంగా రోడ్లు ఇరుకుగా ఉండి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు ఆక్రమణలను తొలగించాలన్నారు. ఎక్కడపడితే అక్కడ ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోరాదని, ప్రారంభంలోనే అడ్డుకోవాలన్నారు. ఏదన్నా సమస్య వస్తే జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతివారం పి జి ఆర్ ఎస్ లో వివిధ రకాలపై ఆక్రమణలపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

ఏకికుత కుటుంబ సర్వే, ఐ గాట్ కర్మయోగి కోర్సులు, అప్సడా, సిఏఏ రిజిస్ట్రేషన్ లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎన్. రామనాథ్ రెడ్డి, డిజిటల్ పంచాయతీ అధికారి ఐ.జ్యోతిర్మయి,, డి ఎల్ డి వో లు జి.రవి, ప్రభాకర్, డిప్యూటీ ఎంపీడీవోలు, గ్రేట్ వన్ అండ్ టు పంచాయతి సెక్రటరీలు, జూనియర్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.