Close

క్రమం తప్పకుండా తరగతులకు హాజరై శ్రద్ధగా పాఠాలు చదువుకోవాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 04/02/2026

పదవ తరగతి విద్యార్థులు భయాన్ని దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు ఎదుర్కోవాలి

పదవ తరగతి విద్యార్థులు భయాన్ని దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలని, క్రమం తప్పకుండా తరగతులకు హాజరై శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, విద్యార్థుల హాజరు, మాక్ టెస్ట్ ల మార్కులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి రోజు తరగతులకు హాజరై శ్రద్ధగా పాఠాలు నేర్చుకోవాలి అన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి బాగా చదువుకుంటే మంచి ప్రయోజకులు అవుతారని అన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత అయిన తర్వాత జీవితంలో త్వరగా స్థిరపడే చదువులను ఎంచుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. 10 వ తరగతి ఉన్నత చదువులకు మొదటి మెట్టు అని తెలిపారు. కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. పరీక్షలను ఒత్తిడిగా కాకుండా ఒక సాధారణ విద్య లాగానే భావించాలని, చదువు ఒక క్రమబద్ధమైన ప్రణాళిక రూపొందించుకొని ముఖ్యమైన అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ సందర్భంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, తహసిల్దార్ రావి రాంబాబు, ప్రధానోపాధ్యాయురాలు పి.రంగవల్లి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.