Close

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వ వైద్యులు భరోసా కల్పించేలా వైద్య సేవలు అందించాలని, అప్పుడే వారు ఆరోగ్యంగా, ఆర్థికంగా పరిపూర్ణంగా ఉంటారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 03/02/2026

ఆకివీడు మండలం పెదకాపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆశా డే మీటింగ్ లో పలు సూచనలు చేశారు. తొలుత ఓపి, యాంటినెంటల్ చెకప్స్, తదితర రిజిస్టర్లను పరిశీలించి కేసులు వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లెప్రసీ, హెచ్ఐవి, టీబీ, డెలివరీ కేసులు ఎన్ని ఉన్నాయని పరిశీలించారు. ఈ నెలలో డెలివరీలు ఎన్ని ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. టిబి వ్యాధిగ్రస్తులకు ముందులను క్రమం తప్పకుండా అందిస్తున్నారా, వారిని చెక్ చేస్తున్నారా, బలమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. బాల బాలికల్లో రక్తహీనత కేసులు ఏమైనా ఉన్నాయా, తరచూ ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి పరీక్షలు చేస్తున్నారా అని అడిగారు. ఒక్క గర్భిణీ కేసు కూడా మిస్ అవ్వకుండా చూడాలని, టార్గెట్ కపుల్స్ ను కలుసుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. కొంతమంది మీకు తెలియకుండానే చెరువుల దగ్గర పనిచేస్తూ అకస్మాత్తుగా ప్రసవం కావడం జరుగుతుందని, అటువంటి కేసులు కూడా మిస్ అవ్వకుండా అన్ని ప్రాంతాల్లో సమాచారాన్ని తెలుసుకొని వారికి వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పేదల పాలిట వరంలా పనిచేయాలని, అప్పుడే వారు ఆరోగ్యంగా, ఆర్థికంగా బలంగా ఉంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని, అవి వైద్యం రూపంలో ప్రజలకు చేరవ చేసే బాధ్యత మీపై ఉందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే వ్యక్తిగతంగా, సామాజికంగా దేశం ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందితో సమావేశంలో ఉండగానే ఒక వృద్ధుడు కాలు ఇన్ఫెక్షన్ వైద్యం నిమిత్తం అక్కడికి రావడంతో .. అతని ఓపి కార్డు పరిశీలించి, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, బిళ్ళలు, ఇంజక్షన్ ఇచ్చారా, హాస్పటల్లో బాగా చూస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతని కాలుకు వచ్చిన ఇన్ఫెక్షన్ ను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రమేష్, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, గ్రామ సర్పంచ్ బేబీ స్నేతు, ఎంపీపీ కటారి జయలక్ష్మి, తహసిల్దార్ ఫరూక్, ఇంచార్జ్ ఎంపీడీవో బిఈ మార్కండేశ్వర రావు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, తదితరులు ఉన్నారు.