విద్యార్థులు ప్రయోజకులు కావాలంటే తొలిమెట్టు పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
ఆకివీడు మండలం పెదకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు వందరోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరను, ప్రతిరోజు నిర్వహిస్తున్న మాక్ టెస్ట్ ల మార్కులను పరిశీలించి ప్రతి విద్యార్థిని వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాల హాజరై హోటల్ నేర్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా 6వ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే సబ్జెక్టులు చాలా ముఖ్యమైనవని, గ్రూప్ 1, గ్రూప్ 2, యుపిఎస్సి, ఐఏఎస్ తదితర పరీక్షలు అన్నింటికీ ఆ సబ్జెక్టులే పునాది అన్నారు. మీరు పాఠశాలకు వచ్చి బాగా చదువుకుంటే మంచి ప్రయోజకులు అవుతారని, జీవితంలో స్థిరపడి తద్వారా తల్లిదండ్రులను చూసుకోగలుగుతారన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత తరువాత ఐటిఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ తదితర కోర్సులు చదివితే కోర్సు పూర్తి అయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదువుకోవాలని, అందరూ పోలీస్ సెట్ ఎగ్జామ్ కూడా వ్రాయాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు పదవ తరగతి తర్వాత ఏ కోర్సులు చేయవచ్చు, ఏ ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలను తెలియజేయాలన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాల నందు ఉన్న లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని, ఏదో ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకుని చదవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా అనేక విషయాలను తెలుసుకోవచ్చు అన్నారు. ఈ సందర్భంలో విద్యార్థులచే బాగా చదువుతామని, తల్లిదండ్రులను చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయించి, వారి దగ్గర నుండి ప్రమాణం తీసుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలోని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, ప్రయోగశాల, మియా వాకి ఫారెస్ట్, బాస్కెట్ బాల్ కోర్టు, షటిల్ కోర్టు పరిశీలించి ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ చేస్తున్న ప్రాసెస్ ను అడిగి తెలుసుకున్నారు. తడి చెత్త, పొడి చెత్త వేరుచేసి అందించేలా ప్రజలలో అవగాహన కల్పించాలని గ్రామ సర్పంచ్, ఎంపీపీ లకు సూచించారు. అలా వేరు చేసి ఇవ్వకపోతే సమాజానికి చేటు చేసినట్లేనని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అనంతరం గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని, ఫిల్టర్ బెడ్లను, చెరువును, వాటర్ పంపింగ్ ను పరిశీలించే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిన అందజేయాలని, ఎక్కడ త్రాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు ఉంటే అరికట్టాలని ఆదేశించారు. క్లోరినేషన్ పక్కాగా జరగాలని సూచించారు.
వాటర్ టాక్స్ కలెక్షన్ ను స్వయంగా పరిశీలించారు. సిబ్బంది చేస్తున్న వాటర్ టాక్స్ కలెక్షన్ ఇన్పుట్స్ ను అడిగి తెలుసుకొని, టాక్స్ చెల్లింపు దారితో మాట్లాడారు. వాటర్ టాక్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు వసూలు చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని గ్రామ కార్యదర్శిని, వీఆర్వోను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఈవో ఇ.నారాయణ, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వై.దోసి రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ బేబీ స్నేతు, ఎంపీపీ కటారి జయలక్ష్మి, ఎంఈఓ రవీంద్రనాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ ఎల్ వి సత్యనారాయణ, తహసిల్దార్ ఫరూక్, ఇన్చార్జి ఎంపీడీవో బిఈ మార్కండేశ్వరరావు, పంచాయతీ సెక్రెటరీ వెంకన్న, వీఆర్వో సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
