జిల్లాలో పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా వందరోజుల ప్రణాళిక పక్కాగా అమలుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతలో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్న వంద రోజులు యాక్షన్ ప్లాన్ అమలును పరిశీలించేందుకు సోమవారం సాయంత్రం భీమవరంలోని ఎస్ హెచ్ బి ఆర్ ఎం హైస్కూల్ నందు ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో ఆదివారం, ఈరోజు నిర్వహించిన పరీక్ష పేపర్లను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు నూరు శాతం సాధించే లక్ష్యంగా ఏర్పాటుచేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో ఊహించని విధంగా ఫలితాలు ఉండాలని, ఇందుకు తగిన విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి అన్నారు. జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉదయం 8.00 గంటలకే పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని, అలాగే సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల మధ్య ప్రతిరోజు మాక్ టెస్ట్ నిర్వహించాలన్నారు. ఈరోజు ఫలితాలను రేపు వెళ్లడించి ఆ విద్యార్థులు ఏ సబ్జెక్టు నందు వెనకబడి ఉన్నారో పరిశీలించాలన్నారు. ఆ విద్యార్థులపై మరింత శ్రద్ధ కనపరచాలని సూచించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో ఇప్పటికే 57 రోజులు గడిచిపోయాయని, మిగిలిన 43 రోజులు కూడా శ్రద్ధగా తరగతులు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాట వేయాలని తెలిపారు. వారు చదువు కొనసాగించాలో ఇప్పటితో ఆగిపోవాలో అంతా మీ చేతిలోనే ఉందని, చాలామంది పదవ తరగతి తప్పితే ఆ విద్యార్థులు చదవడం మానేస్తారని, అటువంటి వారిని ఉత్తీర్ణతతో చదువులు ముందుకు కొనసాగేలా చూసే గురుతర బాధ్యత మీపై ఉందని మరిచిపోవద్దన్నారు. మీరు ఎంత శ్రమ పడితే విద్యార్థులు అంత ప్రగతిని సాధిస్తారని, రానున్న ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా అగ్రస్థానంలో ఉండేలా అందరి కృషి ఫలించాలన్నారు.
ఈ సందర్భంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.