నేడు పిజిఆర్ఎస్ లో 260 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ లో 66 దరఖాస్తులు స్వీకరణ–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
పిజిఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
అర్జీదారుల సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలి.
అర్జీదారుల ఫిర్యాదుల పరిష్కారం, వారు సంతృప్తి చెందే విధంగా ఉండాలి.
సోమవారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీ.డి డాక్టర్ కె. సిహెచ్ అప్పారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ముందుగా పీజి ఆర్ ఎస్ లో అర్జీదారులు అందించే దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను, రెవిన్యూ క్లినిక్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో అర్జీదారుల దరఖాస్తుల నమోదు, పరిష్కార చర్యలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ తో కలిసి స్వయంగా అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ ఆదేశించారు.
పి జి ఆర్ ఎస్ ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినందున ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువు లోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తిచెందేలా సమస్యల పరిష్కారం ఉండాలన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం పీజీ ఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లో అందిన అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించి సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
ఈ రోజు అందిన అర్జీలలో కొన్ని పిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి…..
@ మొగల్తూరు మండలం సేరేపాలెం గ్రామానికి చెందిన తణుకుల నాగదుర్గ అర్జీ సమర్పిస్తూ, తన భర్త కరోనా సమయంలో మరణించారని అప్పటినుండి తన అత్తగారు మానసికంగా వేధించడమే కాకుండా ఇంట్లో ఉండడం లేదని, తనకు ముగ్గురు ఆడపిల్లలని, దయచేసి ఆ ఇంటిలో ఉండే విధంగాను, జీవనాధారం కల్పించాలని కోరారు.
@ వీరవాసరం మండలం, కొణితివాడ గ్రామానికి చెందిన సిహెచ్. రాము అర్జీ సమర్పిస్తూ, తనకు 87% వికలాంగత్వంతో సదరం ద్వారా సర్టిఫికెట్ జారీ కాబడిందని, కావున తనకు వికలాంగ పింఛను మంజూరు చేయాలని కోరారు.
@ తాడేపల్లిగూడెం మండలం, కడకట్ల గ్రామానికి చెందిన బందుల సూరమ్మ అర్జీ సమర్థిస్తూ తనకు నలుగురు కొడుకులని, ఆస్తి రాయించుకున్న తదుపరి తనకు ఆశ్రయం, భోజనం పెట్టడం లేదని తనకు న్యాయం చేయాలని కోరారు.
@ తాడేపల్లిగూడెం మండలం, నందమూరి గ్రామానికి చెందిన కట్ట మంగతాయారు అర్జీ సమర్పిస్తూ, గత ప్రభుత్వంలో రీ సర్వే నందు ఫారం 1బి నందు ఇనాం భూములుగా నమోదయిందని మా భూమిని నా పేరున ఆన్లైన్ చేయాలని కోరారు.
@ భీమవరం 6వ వార్డుకు చెందిన ఉయ్యూరు నాగలక్ష్మి తాను అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, తనకు టిట్కో గృహ సముదాయంలో ఫ్లాట్ కేటాయించారని, రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని, ప్రస్తుతం అదే ఫ్లాట్ వేరే వాళ్ల నివసిస్తున్నారన్నారు. ఫ్లాట్ ఖాళీ చేయమంటే ఖాళీ చేయడం లేదని, దయచేసి తమ ఫ్లాట్ తమకు ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు.
@ పోడూరు మండలం జిన్నూరు గ్రామానికి చెందిన ఆదుర్తి మల్లికార్జునరావు అర్జీ సమర్పిస్తూ, గ్రామంలో తనకు 24 సెంట్లు భూమి ఉందని, సర్వేయర్లు తనకు రెండు రిపోర్ట్ లు ఇచ్చారని, ఏది వాస్తవమో నిర్ధారణ కాలేదన్నారు. పి జి ఆర్ ఎస్ లో ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదన్నారు. దయచేసి మా భూమికి హద్దులు నిర్ణయించి తమ భూమిని తమకు ఇప్పించాలని కోరారు.
@ ఆకివీడు మండలం, ఆకివీడు గ్రామానికి చెందిన పువ్వాడ విజయ్ కుమారి గతంలో తనకు కళాకారుల పెన్షన్ వచ్చేదని, ప్రస్తుతం నిలిపివేయడం జరిగిందని, తిరిగి కళాకారులకు పింఛను ఇప్పించాలని వినత పత్రం సమర్పించారు.
ఈ సమావేశంలో వివిధ శాఖ జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.