Close

గోదావరి పుష్కరాలకు పక్కా ప్రణాళికతో అన్ని ముందస్తు చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు–జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Publish Date : 31/01/2026

జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పిఎం సూర్య పథకం కింద నూరు శాతం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అమరికకు చర్యలు తీసుకుంటున్నాం..

విద్యుత్ సరఫరాలేని కాలనీలను గుర్తించి వెంటనే నివేదికను అందజేయాలి

భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు ఏపీ మైనార్టీ ఎఫైర్స్ చైర్మన్ ఎంఏ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.

తొలుత జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రగతిపై సమావేశంలో వివరిస్తూ అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి పథంలో ఉండేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నామన్నారు. యూరియా కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోళ్లను రికార్డు స్థాయిలో పూర్తి చేయడంతో పాటు, ప్రభుత్వ సహకారంతో కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగానే రైతులు ఖాతాలలో నగదును జమ చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చిందేందుకు డ్వాక్రా మహిళలతో జిల్లాలో రెండు చాక్లెట్ యూనిట్లను, ఆర్గానిక్ అంగడలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌలు రైతులకు కూడా పంట రుణాలను ఇప్పించే దిశగా పిఎసిఎస్ లో సభ్యత్వ నమోదుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందని, అలాగే రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో 100 మంది మత్స్యకారులు ఒక్కొక్కరికి 70 వేల రూపాయల విలువైన పడవలు, వలలను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గుర్రపు డెక్క ద్వారా కంపోస్ట్ తయారీ, తదితర అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని వివరించారు.

జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. జిల్లాలో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో అర్హులైన ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులను గుర్తించి నూరు శాతం ఉచితంగా పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ ప్యానల్స్ అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే నాణ్యమైన పరికరాలను వినియోగిస్తున్నది లేనిది విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో డంపింగ్ యార్డ్ కు అవసరమైన పశ్చిమ ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలన్నారు. కౌలు రైతులకు రుణాలు, రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో డంపింగ్ సమస్య ఉందని, దీని పరిష్కారంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన ప్రాజెక్టులను పరిశీలించడం జరిగిందన్నారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో మిషనరీ ని ఏర్పాటు చేస్తే ఏ రోజు చెత్త, ఆ రోజే క్లియర్ చేసేందుకు పవర్ ప్లాంట్ కు వినియోగించడం జరుగుతుందన్నారు. దీనిని జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి సంబంధిత ప్రాజెక్ట్ అధికారులతో త్వరలో సమావేశము నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఇరిగేషన్ డ్రైయిన్ లు, కాలువల్లో తూడును తొలగించేందుకు ఏజెన్సీలకు ఇప్పటికే డబ్బులు చెల్లించడం జరిగిందని, కాంటాక్ట్ గడువు ముగిసే లోపు గుర్రపు డెక్క తొలగించాల్సిందేనని, అలా చేయని పక్షంలో సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో డ్రైన్లు, కాలువల్లో తూడు, గుర్రపు డెక్క తొలగింపు, కాలువల పక్షాలనకు తీసుకోవలసిన చర్యలపై సర్వే నిర్వహించి పూర్తి సమగ్ర నివేదిక తయారు చేసేందుకు జిల్లాకు టీం వస్తుందని, ఆ సమయంలో ఆ టీంకు నియోజకవర్గంలో ఇరిగేషన్ సమస్యలను వివరించాలన్నారు.

రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా సమావేశాలు జరిగినప్పుడు అజెండా కాఫీలు తెలుగులో ఇవ్వాలని, సమస్యలు పరిష్కారానికి సులువుగా ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే సమావేశాలకు తప్పనిసరిగా తెలుగులో అజెండా కాఫీలు ఇవ్వాలని సూచించారు. ప్రతి సభ్యునికి సమస్యలు తెలియ జేయడానికి కొంత సమయం కేటాయించాలని, సమస్యలు తెలియజేయడానికి పరిష్కరించుకోవటానికి అవకాశం ఉంటుందని అన్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు ఎంత ముఖ్యమో, రైతులకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యమని రైతులు కోసం కొంత సమయం కేటాయించాలని తెలిపారు. జిల్లాలో రెండవ పంటకు నీటికొరత లేకుండా సాగునీరు అందించాలని సూచించారు. భీమవరం పట్టణంలో పొల్యూషన్ ఎక్కువగా ఉందని ఇక్కడ ప్రజలకు ఎక్కువగా విషవాయులు పీల్చున్నారని, డంపింగు యార్డుకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.

ఏపి శాసనసభ ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ మానియోజకవర్గంలో నీటి సంఘాలు, ఇరిగేషన్ అధికారులు ,స్థానిక రైతులు సమన్వయంతో పంటకాలువలు 90 శాతం పైగా చెత్తాచెదారం, పూడిక పనులు పూర్తిచేసుకుని, పంటకాలువలు కళకళ లాడుతున్నాయని అన్నారు. ప్రస్తతం త్రాగునీరు, సాగునీరుకి ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మన జిల్లా నల్లరేగడిలో పామాయిల్ సాగుకు అనుకూలతపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి అధికారులు పూర్తిస్థాయిలో నివేదికను అందించాలన్నారు. ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ అధికారులు, నీటిసంఘాలు ప్రతినిధులు, సంబంధిత రైతులతో నెలకు ఒకసారి సమావేశం నిర్వహించి నట్లయితే రైతులకు మంచి మేలు జరుగుతుందని తెలిపారు.

పీఏసి సభ్యులు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో శాశ్వత పరిష్కారానికి ఉప్పుటేరు ట్రేడ్జిoగు చేయించుటకు చర్యలు తీసుకోవాలని, అవసర మైతే క్రాఫ్ హాలిడే ప్రకటించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి గోనె సంచులు కొరత లేకుండా చూడాలన్నారు. పురుగులు మందులు స్ప్రే చేస్తుండగా ఒక రైతు చనిపోయాడని, మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేశారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించి పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు.

ప్రభుత్వ విఫ్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ గతంలో వ్యవసాయం నియోజక వర్గంలో 30 వేల ఎకరాలు సాగులో ఉండేదని, ఇప్పుడు 5 వేలు ఎకరాలు సాగు మాత్రమే ఉందని ఆవేదనవ్యక్తం చేశారు. వరి పంటకు పూర్వం వైభవం వచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. అవుట్ పాల్స్ స్లూయిజ్ షట్టర్లు, గేట్లు సరిగ్గా పనిచేయుట లేదని, వాటిని రిపేర్లు అవసరం అయితే వాటిస్థానంలో క్రొత్తవి వేయించాలని అన్నారు. గత ప్రభుత్వంలో కాలనీలకు లెవిలింగు పనులు చేయించాలని, విద్యుత్తు శాఖ ఏఇ, ఇతర సిబ్బందిని నియమించాలని కోరారు.

ప్రభుత్వ విఫ్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించి, గ్రామాలు అభివృద్ధికి, కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కొంతమంది రైతులు తెలియక అనవసరంగా ఎక్కువగా ఎరువులు వాడుతున్నారని, దీనివల్ల రైతులకు వ్యవసాయం గిట్టుబాటు ఉండదని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించి సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని వినియోగించు కునేలా అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. దీనివల్ల ఆరోగ్యవంతమైన పంటను పండించుకోవచ్చునని, లాభసాటి వ్యవసాయం రైతులు ఆర్థికంగా బలోపేతం కాగలరని అన్నారు.

తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పంట కాలువలకు పటిష్ట చర్యలకు గోస్తాని నదికి రిటైనింగు గోడ నిర్మాణంకు సంబంధించిన ఫైలు సియంవో కార్యాలయంలో పెండింగులో ఉందని, క్లియర్ చేయించినట్లయితే నియోజకవర్గ కాలువలకు పూర్వవైభం వచ్చి రైతులకు మేలు జరుగుతుందన్నారు. మంచిలి గ్రామంలో సాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని స్తంభాలు వేయించి కరెంటు కనెక్షన్ ఇచ్చినట్లయితే సాగనీటి కష్టాలు తీరి రైతులకు మంచిజరుగుతుందన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా బిసిలకు కొన్ని మద్యం దుకాణాలు కేటాయించాలని నిబంధన ఉండగా కొన్ని నియోజక వర్గాలలో ఒక్క షాపు కూడా కేటాయించలేదని, ఒక్కసారి పరిశీలన చేసి కేటాయింపులు చేయించి బిసిలకు న్యాయం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి,జిల్లా రెవిన్యూ అధికారి బి.శివనారాయణ రెడ్డి,ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా వివిధ శాఖలు అధికారులు, ఏపి అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు,ఏపి మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, ఏపీ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏపి భవన నిర్మాణ కార్మిక ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, ఏపి టైలర్స్ డెవలప్మెంటు కో-ఆపరేటివ్ పెడరేషన్ చైర్మన్ ఏ.వి.వి.యల్. యన్.స్వామి, ఏపి కృష్ణ బలిజ పూసల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, డిసియం యస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఉమ్మడి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, ఉమ్మడి జిల్లా సాగునీటి సంఘాల అధ్యక్షులు కూనదరాజు మురళీకృష్ణంరాజు, ఏయంసి చైర్మన్ కలిదిండి సుజాత, తదితరులు పాల్గొన్నారు.