Close

వికసిత్ భారత్ సంకల్పంలో ప్రతి శ్రామికుడు భాగస్వామి కావాలి–కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

Publish Date : 31/01/2026

వీరవాసరం మండలం వడ్డిగూడెం, పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామాలలో ఉపాధిహామీ కూలీలతో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. విబిజి రామ్ జీ (VBG RAM G) పథకంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని నమ్మవద్దు – పథకం అమలులో పారదర్శకతే మోదీ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. దేశాభివృద్ధిలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ప్రతి కూలీని భాగస్వామిని చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. శనివారం వీరవాసరం మండలం వడ్డిగూడెం, పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామలలో ఆయన పర్యటించారు. మొదట వడ్డీగూడెం గ్రామంలో పంటకాలువ పూడికతీత పనుల్లో నిమగ్నమైన ఉపాధి హామీ కూలీలను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలతో కలిసి కూర్చుని వారితో నేరుగా ముచ్చటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో విప్లవాత్మక మార్పులతో తీసుకువచ్చిన ‘VB G RAM G’ (వికసిత్ భారత్ – గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి హామీ మిషన్ ) పథకం గురించి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కూలీలకు వివరించారు. గతంలో కేవలం 100 రోజులుగా ఉన్న పని దినాలను ఇప్పుడు 125 రోజులకు పెంచడం జరిగిందని, గతంలో చేసిన పనికి వేతనాల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేదని, కానీ నేడు ఈ నూతన చట్టం ద్వారా వారం రోజుల్లోనే, గరిష్టంగా 15 రోజుల్లోపు వేతనాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయటం జరుగుతుంది అని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.ఈ పథకానికి పేరు మార్చడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వాలు కేవలం ప్రచారం కోసమే పథకాలకు తమ నాయకుల పేర్లు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాయని, కానీ మోదీ ప్రభుత్వం పథకం యొక్క నాణ్యత, పారదర్శకతపై దృష్టి పెట్టిందని అన్నారు. రాజీవ్ గాంధీ క్రీడాకారుడు కాకపోయినా ఖేల్ రత్న అని పేరు పెట్టారని, ఇందిరా ఆవాస్ యోజన, జగనన్న గోరుముద్ద వంటి పేర్లతో గత పాలకులు కాలక్షేపం చేశారని దుయ్యబట్టారు. పేరు ఏదైనా, పేదవాడికి మేలు జరగాలనేదే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. వ్యవసాయ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకంలో కీలక సంస్కరణలు తెచ్చామని, సాగు మరియు కోతల సమయంలో కూలీల కొరత తలెత్తకుండా ఏడాదిలో 60 రోజుల విరామం ఇచ్చేలా నిబంధనలు రూపొందించామని దీని వల్ల రైతులకు కూలీలకు ఎంతో ప్రయోజనకరమని శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. కేవలం గుంతలు తీయడమే కాకుండా, గ్రామాల్లో నీటి భద్రత, సిమెంట్ రోడ్లు, గిడ్డంగుల వంటి శాశ్వత ఆస్తుల నిర్మాణంపై ఈ పథకం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన వివరించారు. పథకం అమలులో అవినీతికి తావులేకుండా సాంకేతికతను జోడించామని, AI ఆధారిత పర్యవేక్షణ, GPS, బయోమెట్రిక్ హాజరు ద్వారా పారదర్శకత పాటిస్తున్నామని అన్నారు. ఒకవేళ సకాలంలో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి కూడా చెల్లించేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయని, చేసిన ప్రతి పైసా ఖర్చుకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచి సైదు శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు వెండ్ర దివాకర్, నీటి సంఘం డి.సి. చైర్మన్ ఆకుల లీలా కృష్ణమూర్తి, ఎం.పి.టి.సి విజయలక్ష్మి, కూరెళ్ల నరసింహా రావు, కొల్లి వెంకట్రావు, జనసేన అధ్యక్షులు జవ్వాది బాలాజీ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.