బీవి రాజు సర్కిల్ నందు నూతన బస్ స్టాప్ ను ప్రారంభించిన–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పనలో భాగంగా బీవి రాజు ఫౌండేషన్ సహకారంతో నూతన బస్టాండ్ నిర్మాణం…
భీమవరం పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
భీమవరం పట్టణంలోని బివి రాజు సర్కిల్ నందు బివి రాజు ఫౌండేషన్ దాతృత్వంతో రూ.8 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన నూతన బస్ స్టాప్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, బివి రాజు కళాశాల స్టూడెంట్స్ ఎఫైర్స్ డైరెక్టర్ పి.శ్రీనివాసరాజు, కళాశాల విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు. బస్ స్టాప్ ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే దాతల సహకారంతో పట్టణంలో అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం జరిగిందని, మరిన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. జిల్లా ప్రధాన కేంద్రాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరాయంగా కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే బివి రాజు ఫౌండేషన్ దాతృత్వంతో పట్టణంలో పలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.