Close

పిజిఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ఫిర్యాదుదారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ …

Publish Date : 27/01/2026

పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులను మరింత నాణ్యతతో పరిష్కరించాలి..

పరిష్కరించిన ఫిర్యాదులే మరల ప్రారంభించడం అంటే అధికారులు చేసిన పరిష్కారాన్ని ప్రశ్నించుకోవాలి…

ప్రజల సమస్యలను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు కృషి చేయాలి..

…… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

ప్రజల స్థానంలో మనమే ఉంటే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచన చేస్తామో అదే రీతిలో పి జి ఆర్ ఎస్ సమస్యలను కూడా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పి జి ఆర్ ఎస్ లో వచ్చిన ఫిర్యాదులపై లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలకు అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. పాలకొల్లు మండలం అరట్లకట్ల గ్రామ నివాసి చోప్పుల లక్ష్మీకాంతం, పెంటపాడు గ్రామం మహమ్మద్ జెరీనా, కవిటం గ్రామం కోట వెంకట గోవింద సత్యనారాయణ, పెనుగొండ గ్రామం సత్తి సీతాదేవి, అత్తిలి గ్రామం కానుమిల్లి విజ్ఞ కిషోర్ లతో స్వయంగా ఫోన్ చేసి పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పి జి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అర్జీదారులకు వేగవంతమైన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వారితో మమేకమై వారి సమస్యను పూర్తిగా విని పరిష్కారం చేయాలని సూచించారు. కింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధాన్ని ఎట్టి పరిస్థితుల్లో పంపించవద్దని, కొంచెం సమయం ఫిర్యాదులకు కేటాయించి నాణ్యతగా పరిష్కరించాలని తెలిపారు. ఒకసారి వచ్చిన ఫిర్యాదు మరల అదే ఫిర్యాదు పై ప్రజలు రావడం సమంజసం కాదని, వారికి మనకి సమయం కూడా వృధా అవుతుందని గమనించాలన్నారు. మంచి పరిష్కారం మంచి అధికారిగా గుర్తింపు తెస్తుందని, ఇది చిరస్థాయిగా నిలుస్తుంది అన్నారు. పి.జి.ఆర్.ఎస్ పరిష్కారాల్లో అలసత్వం వహించే అధికారులకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు.

ఈ సందర్భంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి ఉన్నారు.