చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి, వ్యక్తిగత శ్రద్ధతో బోధన అందించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు విద్య శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాసేందుకు వారిని మానసికంగా సంసిద్ధం చేయాలి.
వచ్చే మార్చి నెలలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా వందరోజుల కార్యాచరణపై డిప్యూటీ ఎంఈఓ, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు, ఒకేషనల్ టీచర్లతో శనివారం ఉండి జిల్లా పరిషత్ పాఠశాల స్వామి వివేకానంద సమావేశ మందిరం నందు నిర్వహించిన సబ్జెక్టు టీచర్స్ కాంప్లెక్స్ సమావేశంకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మున్ని మండలం పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థుల హాజరు, విద్యార్థుల విద్యా ప్రమాణాలుపై పాఠశాలల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న దృష్ట్యా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రస్తుత ప్రగతి, విద్యార్థులు వెనుకబడి ఉన్న సబ్జెక్టులలో పురోగతి సాధించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు, మోడల్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వ్యక్తిగత శ్రద్ధతో బోధన అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు ముఖ్యంగా బాలికలు డ్రాప్ ఔట్స్ లేకుండా చూడాలన్నారు. కొంతమంది విద్యార్థులకు పరీక్షలపై భయం ఉంటుందని, అటువంటి విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాసేందుకు మానసికంగా సంసిద్ధత చేయాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉత్తీర్ణత శాతం ఉండాలన్నారు.
భవిష్యత్తులో విద్యార్థులు ఏ రంగంలో రాణించాలన్న పదవ తరగతి ఉత్తీర్ణతపై ఆధారపడి ఉంటుందని, పదవ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పదవ తరగతి పరీక్షలు పాసైన అనంతరం ఇంటర్మీడియట్ మాత్రమే కాకుండా ఐటిఐ, ఎలక్ట్రికల్, ఏఎన్ఎం కోర్సులు చేయడం ద్వారా మంచి ఉపాధి పొందవచ్చు అన్నారు. దీనికి పునాది 10వ తరగతి ఉత్తీర్ణత పై ఆధారపడి ఉంటుందన్నారు. స్థానిక శాసనసభ్యులు చొరవతో ఉండి జిల్లా పరిషత్ పాఠశాలకు మెరుగైన వసతులను కల్పించడం జరిగిందని, కానీ విద్యా ప్రమాణాలలో జిల్లాలో వెనుకబడి ఉండడం కనిపిస్తుందన్నారు. ఉపాధ్యాయులు శక్తివంతన లేకుండా విద్యా ప్రమాణాలు పెంపుకు కృషి చేయాలన్నారు. స్థానిక నాయకులను ఆహ్వానించి వారు పిల్లలతో మమేకమై విద్య వలన కలిగే ఉపయోగాలను, చదువుపై శ్రద్ధను పెంపొందించేలా ప్రోత్సాహానికి సమావేశాలను నిర్వహించాలని సూచించారు. పెద్ద పుల్లేరు గ్రామంలో ముగ్గురు పిల్లలను బడికి పంపకుండా వారి తండ్రి నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు ఉందని, వెంటనే సంబంధిత వ్యక్తికి నోటిసుజారీ చేసి ఆ పిల్లలను బడిలో గాని, వసతి గృహంలో గాని ఉంచి చదువు కొనసాగించేలా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు. ముగ్గురిలో ఒక పాప పదవ తరగతి పరీక్షలు రాయాల్సి ఉందని ఆ పాప కచ్చితంగా పరీక్షలు పాస్ అయ్యేలా విద్యా బోధన చేయాలని ఆ పాఠశాల హెచ్ఎం ను ఆదేశించారు. ప్రైవేటు పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందిస్తున్నాయని రానున్న విద్యా సంవత్సరం నుండి ఆరో తరగతి నుండి ఒకేషనల్ కోర్సులు కూడా ప్రారంభించడం జరుగుతుందని, విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థి ఆరో తరగతి నుండి ఏ సబ్జెక్టులో వీక్ గా ఉన్నారు గమనించి ఆ సబ్జెక్టు నందు ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే పదవ తరగతి ఉత్తీర్ణతలో అడ్డంకులు ఉండవని సూచించారు.
తొలుత కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లాలోని ఎంఈఓ లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి విద్యార్థులకు వంద రోజులు కార్యాచరణ అమలుపై తీసుకుంటున్న చర్యలు, విద్యా ప్రమాణాలు పై మండలాల వారీగా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఉండి జెడ్పీ స్కూల్ హెచ్ఎం వై.రామలక్ష్మి, ఎంఈఓలు వన్ అండ్ టు, ఉండి మండలంలోని హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.