రానున్న వర్షాకాలం సీజన్ దృష్టిలో ఉంచుకొని జిల్లాలో అవసరమైన ఇసుక నిల్వలను ముందస్తు సిద్ధంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం సంబంధిత కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి, సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఇసుక కొరత ఏర్పడకుండా అవసరమైన స్టాకును ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు ఎండిఎల్ పాయింట్స్ నందు 1,32,954 మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచడం జరిగిందని, ఇప్పటివరకు 17,052 మెట్రిక్ టన్నులు మాత్రమే వినియోగించుకోవడం జరిగిందని ఇంకా 1,15,902 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఇసుక అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సంవత్సరం జనవరి నుండి జూన్ 2026 వరకు, రానున్న వర్షాకాలం సీజన్ జూన్ నుండి అక్టోబర్ వరకు దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఇసుకను ముందస్తుగా స్టాక్ పాయింట్లు వద్ద నిల్వ ఉంచాలన్నారు. గత సంవత్సరం లక్ష్యానికి అదనంగా 10 శాతం పెంచి ఈ సంవత్సరం 1,46,249 మెట్రిక్ టన్నుల ఇసుకను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కొన్ని స్టాక్ పాయింట్ ల నందు ఇసుక నిల్వలు అధికంగా ఉన్నాయని, దీనికి కారణం తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల రీచ్ నుండి నేరుగా కొనుగోలు చేయుటకు లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారని, రిచ్ కి .. స్టాక్ పాయింట్ కు ధరలో వ్యత్యాసం కూడా ఒక కారణంగా ఉందని, ఎం.డి.ఎల్ పాయింట్స్ అనుమతితో నేరుగా రిచ్ నందు ఇసుకను పొందుటకు అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా ఎండీఎల్ నిర్వహకులు కోరడం జరుగుచున్నదని జిల్లా మైన్స్ అధికారి సమావేశం దృష్టికి తీసుకురాగా, ఈ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి, ఆరుగొలను, పెంటపాడు మండలం ప్రత్తిపాడు లలో అక్రమ ఇసుక నిలువలను గుర్తించి పోలీస్, రెవెన్యూ, మైన్స్ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ లో సీజ్ చేసిన 2,769.60 మెట్రిక్ టన్నుల ఇసుకను మండల తహసిల్దారులకు అప్పగించి ప్రభుత్వ పనుల నిమిత్తం టన్ను ఒక్కింటికి రూ.450/- లు చెల్లించి వినియోగించుకునేందుకు పరిశీలించాలని మైన్స్ అధికారులు ఆదేశించారు. అక్రమ ఇసుక నిల్వదారులకు జారీ చేసిన మొదటి నోటీసుకు వివరణ సరిగా లేనందున, మరొకసారి నోటీసు ఇచ్చి తదుపరి చర్యలకు జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. జిల్లా నుండి ఇసుక అక్రమ రవాణా నిరోధించేందుకు జిల్లా సరిహద్దు మూడు వైపులా తాడేపల్లిగూడెం, చించినాడ, సిద్ధాంతం నందు చెక్ పోస్ట్ లు ఏర్పాటుకు పోలీస్, రెవెన్యూ, మైన్స్ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెనుగొండ మండలం సిద్ధాంతం, నడిపూడి, ఆచంట మండలం కరుగోరుమిల్లి, కోడేరు గ్రామాల నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక డిపాజిట్స్ ను ప్రజలు వినియోగించుకొనుటకు సి ఆర్ జెడ్ నిబంధనలను, రెగ్యులర్టీస్ ను పరిశీలించి సంబంధిత నివేదికను అందజేయవలసిందిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి జి.వెంకటేశ్వరరావు, ఆర్డీవోలు, తహసిల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.