గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
జిల్లా కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన జిల్లా కలెక్టరేట్ పెరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముందుగా చేపట్టాలన్నారు. వేదికను సుందరంగా అలంకరించాలని, సీటింగ్ ఏర్పాటులు చేయాలన్నారు. ప్రోటోకాల్ విధిగా పాటించాలని, విఐపి లకు ఆహ్వాన పత్రాలను ముందుగా అందజేయాలని ఆదేశించారు. విద్యార్థులతో జాతీయ సమైక్యత చాటి చెప్పే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జిల్లా ప్రగతిని ప్రతిమభించే విధంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచడంతోపాటు నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలు జరిగే ప్రాంతమంతా పారిశుధ్యం సక్రమంగా ఉండేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. వచ్చిన వారందరికీ మంచినీటి సదుపాయం, విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. అవార్డులు అందుకునే వారి జాబితా సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరేట్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వై దోసిరెడ్డి, డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, కలెక్టరేట్ ఏవో ఎన్. వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.