అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో సమీక్ష
సంక్రాంతి సెలవులు అనంతరం ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జిల్లాలో బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థుల సౌకర్యాలపై దృష్టి సారించాలి.
జిల్లా కలెక్టరేట్ పీ జి ఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీఫై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి సెలవులు అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలలకు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వసతి గృహాలకు హాజరయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సంక్షేమ, వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వసతి గృహాలలో డోర్లు, కిటికీలు, విద్యుత్ సరఫరా, దోమతెరలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు.
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ పై కలెక్టర్ సమీక్షిస్తూ పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కేవలం రెవెన్యూ శాఖదీ మాత్రమే కాదని, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఫిబ్రవరి మాసంలో పంపిణీ చేయు పట్టాదార్ పాస పుస్తకాలలో పేరు, ఫోటో,ఆధార్,సర్వే నంబర్ తదితర వివరాల నమోదులో ఒక్క తప్పు కూడా ఉండకూడదన్నారు. ఈ విషయంపై డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి , డిఆర్ఓ బి శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారి వై. దోసిరెడ్డి,డ్వామా పిడి డా కె సి హెచ్ అప్పారావు, డిపిఓ ఎం రామ్నాథ్ రెడ్డి, డి.ఎస్.ఓ ఎన్ సరోజ, తదితర అధికారులు పాల్గొన్నారు.